సినీ ఫీల్డ్‌లో అత్యధిక కాలం పనిచేసిన హీరోలు కూడా.. దాదాపు 40 మంది హీరోయిన్లతోనే పనిచేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజ హీరోలు కూడా.. సినీ ఫీల్డ్‌ను ఏలినప్పుడు.. 30-50 మధ్యలోనే హీరోయిన్లతో పనిచేశారు. ఎన్టీఆర్ అయితే.. 40 మందితోనే సినిమాలుచేశారు. అయితే.. ఎక్కువగా అప్పట్లో ఒకే హీరో-ఒకే హీరోయిన్ నటించేవారు. సావిత్రి, అంజలీదేవి, జయలలిత, కృష్ణకుమారి, షావుకారు జానకి, జమున వంటి అగ్రతారలే ఎక్కువగా సినిమాల్లో నటించేవారు.
ఎస్ వరలక్ష్మి వంటివారు కూడా ఎక్కువగా నటించినా.. హీరోలను మార్చేందుకు వారు ఇష్టపడేవారు కాదు. దీంతో హీరోలకు ఎక్కువ మందితో సినిమాలు చేసే అవకాశం రాలేదు. ఇక, ఒక్క సినిమా చేసినా.. సక్సెస్ రేటునే చూసుకునేవారు. ఇక, అక్కినేని తన నట జీవితంలో మొత్తం 48 మంది హీరోయిన్లతో చేశారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు.. ఆయన నటించిన సినిమాల్లో 48 మంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు. వీరిలోనూ ఎక్కువగా అంజలీదేవి, జమున, సావిత్రి, భానుమతిఉన్నారు. ఇక, యువతరం వచ్చేసరికి శ్రీదేవితో ఎక్కువగా స్క్రీన్ పంచుకున్నారు.
కృష్ణ, శోభన్‌బాబు కూడా.. దాదాపు ఇదే రేంజ్‌లో ఉన్నారు. కానీ, ఇటీవల మరణించిన చంద్రమోహన్ మాత్రం ఏకంగా 60 మంది హీరోయిన్లతో హీరోగా నటించి మెప్పించారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఔను.. ఇది నిజమే. ఆయనకు అన్ని అవకాశాలు వచ్చాయి. అయితే.. దీనివెనుక సెంటిమెంటు కూడా ఉందని అంటారు. చంద్రమోహన్‌తో నటి్స్తే.. ఆ హీరోయిన్ టాప్ రేంజ్‌కు వెళ్తారనే టాక్ ఉండడమే కారణమని అంటారు.
‘‘యాదృచ్చికమే అయినా నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో ఎక్కువమంది అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ, విజయశాంతి… ఇలా ఎంతమందికో నేను తొలి హీరోను. అయితే అందులో నా ప్రతిభ ఏమీ లేదు. అది వారి అదృష్టం, ప్రతిభ. ‘చంద్రమోహన్ పక్కన నటిస్తే టాప్ హీరోయిన్ పొజిషన్ గ్యారంటీ’ అనే సెంటిమెంట్ వ్యాపించేలా చేశారు.“ అని వినయంగా చెప్పుకొనేవారు చంద్రమోహన్. ఈ రికార్డు అన్నగారు కూడా సాధించలేక పోవడం గమనార్హం.