తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించి అనేక సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి. హీరోలకు ధీటుగా యాక్షన్ ఎపిసోడ్లలో నటించి వారికి తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ అంటే నయనతార పేరు వినిపిస్తోంది. కానీ 30 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ ఎవరు ? అంటే విజయశాంతి పేరు వినిపించేది.
ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 సంవత్సరాలు పూర్తి అయింది. చాలా యేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విజయశాంతి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే జూన్ 24, 1966లో ఆమె వరంగల్లో జన్మించి మద్రాసులో పెరిగారు. ఆమె పేరు వెనక కూడా ఆసక్తికర స్టోరీ ఉంది.
విజయశాంతి అసలు పేరు శాంతి. అయితే విజయశాంతి పిన్ని అయిన విజయలలిత. అలనాటి తెలుగు మేటినటి. ఆమె ప్రోత్సాహంతోనే విజయశాంతి సినిమా రంగంలో అడుగు పెట్టింది. విజయశాంతి తన ఏడవ సంవత్సరంలోనే బాలనటిగా సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆమెను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీయ రాజా.
విజయశాంతి తన శాంతి పేరుకు ముందు తన పిన్ని విజయలలిత పేరులోని విజయ అనే పేరును యాడ్ చేసుకున్నారు. దీంతో శాంతి కాస్త విజయశాంతిగా మారారు. అక్కడ నుంచి ఆమె అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.