నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా నుంచి దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అంతకు ముందు కథ, దర్శకుల విషయంలో బాలయ్యకు పెద్దగా పట్టింపులు ఉండేవే కాదు. అఖండ ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో అప్పటినుంచి కథలు, దర్శకుల ఎంపికలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్టే వరుస బ్లాక్ బస్టర్లు బాలయ్య ఖాతాలో పడుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా కూడా అంచనాలకు మించి ఆడడంతో నెక్ట్స్ బాలయ్య బాబితో చేసే 109వ సినిమా షూటింగ్ కూడా మొదలుకాకుండానే అంచనాలు పెరిగిపోయాయి.
వచ్చే నెల రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమా. ఆ తర్వాత బాలయ్య ఎవరితో సినిమాలు చేస్తారు ? అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా కీలకమైన కొన్ని ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరో మూడేళ్ల దాకా బాలయ్య డైరీ చాలా బిజీగా ఉండేలా ప్లానింగ్ అయితే జరుగుతుంది. బాలయ్య 110వ సినిమా బోయపాటి శ్రీనుతో ఆల్మోస్ట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ఇది అఖండకు సీక్వెల్ గా అఖండ 2గా ఉంటుందని అంటున్నారు.
అఘోర పాత్రను కొనసాగించడంతో పాటు పొలిటికల్ టచ్ వచ్చేలా బోయపాటి ఈ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాలయ్య 111వ సినిమా కోసం పూరి జగన్నాథ్ తో పాటు.. వీరసింహారెడ్డి దర్శకుడు మలినేని గోపీచంద్ ఇద్దరు పోటీపడుతున్నారు. పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేస్తానని బాలయ్య ఇప్పటికే హామీ ఇచ్చారు. పూరి కూడా బాలయ్య కోసం కథ రెడీ చేసుకుని ఉన్నారు. ఇటు వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యాక మరోసారి మలినేని గోపీచంద్ తో సినిమా ఉంటుందని బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు.
ఈ సినిమాను కూడా వీరసింహారెడ్డిని నిర్మించిన మైత్రి మూవీస్ వాళ్లే నిర్మిస్తారు. మలినేని గోపీచంద్, పూరి జగన్నాథ్ సినిమాలు ముందు, వెనక అయినా బాలయ్యకు ఈ రెండు సినిమాలు 111వ, 112వ ప్రాజెక్టులు కానున్నాయి. ఇక బాలయ్య 113వ సినిమా సుకుమార్ లేదా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా మరో మూడేళ్ల వరకు బాలయ్య డైరీ అయితే ఖాళీ ఉండదు అన్నది వాస్తవం.