దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఆయన తీసిన సినిమా లపై ఎంత మక్కువ ఉందో.. ఎంత ఆదరణ ఉందో అదే సమయంలో సద్విమర్శలు కూడా ఉన్నాయి. దివంగత జంధ్యాల శిష్యుడిగా ఆయన భావాలను పుణికి పుచ్చుకున్న ఈవీవీ.. తరచుగా మన చుట్టూ తిరిగే అంశాలనే కథాంశాలుగా రూపొందిస్తారు. నిజానికి ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు.
జంధ్యాలను తీసుకుంటే.. ఆయన తీసిని సినిమాలు కూడా మన ఇంటి పక్కన జరిగిన కథేనా అన్నట్టుగా అనిపిస్తాయి. ఇక, ఆయనకన్నా మరో అడుగు ముందుకు వేసిన ఈవీవీ.. ఆయన సినిమాల్లో అచ్చంగా మన కథనే జోడించారా? అనేలా సినిమాలు తీశారు. టైటిల్స్ నుంచి కథల వరకు కూడా ఈవీవీ మాస్ జనాలను అదేసమయంలో హాస్య జనాలను కూడాదృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించేవారు.
ఇలా వచ్చిన వాటిలో మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది
, ఎవడి గోల వాడిది
-లాంటి టైటిల్స్ అనేకం జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. అంతేకాదు.. తన కథల్లో ఎక్కడా పెద్దగా కల్పితం ఉండదని.. మీ ఇంట్లో జరుగుతున్న, జరిగిన విషయాలే తెరమీద చూసుకున్నట్టుగా ఫీలవుతారని ఈవీవీ చెప్పేవారు. నిజానికి ఆయన సినిమాలు కూడా అలానే ఉండేవి.
ఇక, ఈవీవీపై సద్వివిమర్శల విషయానికి వస్తే.. జంద్యాలను ఈ విషయంలో డామినేట్ చేయలేక పోయారని అంటారు. ఎందుకంటే.. జంధ్యాల పండించిన హాస్యం ఎక్కడా డబుల్ మీనింగులు లేకుండా సాగితే.. ఈవీవీ హాస్యం మాత్రం ఒకింత డబుల్ మీనింగులు పండేవి. దీంతో కుటుంబ సమేతంగా కూర్చుని చూసేందుకు ఇబ్బందులు వచ్చేవని విమర్శలు చెప్పేవారు. ఎలా చూసుకున్నా.. ఈవీవీ వెండితెరపై ఒక శకం సృష్టించి మాయమయ్యారనడంలో సందేహం లేదు.