ఆయన తన గళంతో అనేక మందిని ఆకట్టుకున్నారు. వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య
అని ఆయన కంచుకంఠం తరతరాలకు గుర్తుండిపోయేలా చేశారు. కొంగర జగ్గయ్య… సినిమాల్లోకి రాకముందు.. ఆయన రేడియోలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు. ఆయన గళం వినేందుకు ఉదయాన్నే గ్రామీణుల నుంచి పట్టణ వాసుల వరకు అనేక మంది రేడియోల దగ్గరే కూర్చునే వారు. ఇప్పటి మాదిరిగా చేతిలో ఇమిడిపోయే రేడియోలు అప్పట్లో లేవు. మనం వాడి పారేసిన.. పెద్ద టీవీలంత సైజులో రేడియోలు ఉండేవి.
అయితేనేం.. ఎంతో ఓపికగా.. జగ్గయ్య స్పష్టంగా.. ఎక్కడా సందేహాలు కూడా లేకుండా.. చదివే వార్తలు.. అప్పట్లో ప్రజలను ఎంతో ఆకర్షించాయి. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఆయన ఆరు సంవత్సరాలు పనిచేశారు.జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యూస్ రీడర్‌గా జీవితాన్ని ప్రారంభించినా.. తర్వాత, నటుడిగా మారి, వెండితెరపై ఎన్నో విజయవంతమైన పాత్రలను పోషించారు. విలక్షణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది ఆయన గొంతే అంటే ఆశ్చర్యం వేస్తుంది.
‘‘మనం’ అనే భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకుపోతుంది’’ అని పలు వేదికలపై అంటుండేవారు. కళావాచస్పతిగా బిరుదు పొందిన జగ్గయ్య.. కంచు కంఠం.. రాజకీయ వేత్త.. సాహిత్యకారుడు.. సినీ నటుడు.. ఇలా పాత్రలు వేరు కావచ్చు.. కానీ, జగ్గయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఎంత బిజీ అయిపోయారంటే.. రేడియోలో వార్తలు చదివే రోజుల్లో పనిలేదని బాధపడేవారు కాదు. కానీ, ఎక్కువ సేపు నిద్రపోయేవారు.
కానీ, జగ్గయ్య బాగా బిజీగా ఉన్న రోజుల్లో రాత్రి, పగలూ షూటింగ్‌లలో పాల్గొనేవారు. దాదాపు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు. ఒక్కొక్కసారి ఆయన ఒప్పుకొన్న చిత్రాల షూటింగ్‌లన్నీ పూర్తయ్యేందుకు రోజులు పట్టేవి. దీంతో రెండు మూడు గంటలకు మించి నిద్రపోయేవారు కాదు. ఇలా.. ప్రసిద్ధి పొందిన జగ్గయ్య తొలినాళ్లలో హీరోగా నటించినా.. తర్వాత కాలంలో ఆర్థికంగా బలోపేతం అయ్యాక క్యారెక్టర్ నటుడిగా మారడం గమనార్హం.