ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల గురించి అందరికీ తెలిసిందే. వీటి గురించి ఎవరికైనా తెలియకపోయినా.. ఇటీవల జరిగిన నందమూరి-నారా ఫ్యాన్స్ వివాదంతో దాదాపు అందరికీ తెలిసి పోయింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా ఏకమై.. ఒక సంఘంగా ఏర్పడి.. తమ సమస్యలపై చర్చించడంతోపాటు.. ఏపీకి అంతో ఇంతో మేలు చేయాలనే తలంపుతో 1970లలోనే తానాను ఏర్పాటు చేసుకున్నారు.
ఒక్క వారి సమస్యల పరిష్కారం కోసమే కాదు.. అమెరికాలో తెలుగు సంప్రదాయాలను.. సంస్కృతులను కూడా పరిచయం చేయడంతోపాటు.. తెలుగు నేల తాలూకు ఉనికినిమరిచిపోకుండా.. తరతరాలకు అందించాలనే గొప్ప లక్ష్యాన్ని కూడా.. తానా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఏటా తానా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలినాళ్ల నుంచి నేటి వరకు కూడా ఈ సభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వివిధ రంగాలకు చెందిన వారిని ఆహ్వానిస్తారు.
ముఖ్యంగా సినీ రంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారిని ఆహ్వానించి.. సన్మానాలు.. సత్కారాలు చేస్తుండడం ద్వారా.. తానా పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు.. అమెరికాలో తెలుగు సంఘాలు చాలా నే ఉన్నాయి. కానీ.. తానా ప్రత్యేకతే వేరు. తానా నుంచి ఆహ్వానం అందుకోవడం అంటే.. ఎంతో గొప్పగా భావించేవారు కూడా ఉన్నారు. ఒకసందర్భంలో అన్నగారు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజానికి రెండు మూడు సార్లు ఆయన తానా సభలకు హాజరయ్యారు.
తొలి ఏడాది మాత్రం అన్నగారు తానాకు దిశానిర్దేశం చేశారు. ఇది తెలుగువారి కోసం.. తెలుగు వారే ఏర్పా టు చేసుకున్న సంఘమని.. తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని.. తెలుగు వ్యాప్తికి.. తెలుగు సంస్కృతిని పరిపుష్టం చేయడానికి ప్రయత్నించాలని ఆయన ఆసందర్భంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాజకీయా లకు వేదికగా కూడా కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు తెరమీదికి వచ్చిందంటే.. ఇటీవల జరిగిన వివాదం కారణంగానే!