ఇదేం కర్మ కానీ అర్థం కావటం లేదు.. మాస్ మహారాజ్ రవితేజకు ఒక హిట్ సినిమా వస్తే నాలుగైదు ప్లాప్ సినిమాలు వస్తున్నాయి. ధమాకాతో హిట్ కొట్టిన రవితేజ ఆ వెంటనే సంక్రాంతికి చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్యతో మరో హిట్ కొట్టారు. ఆ తర్వాత రావణాసుర, తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో రెండు ప్లాపులు తగిలాయి. వచ్చే సంక్రాంతికి రవితేజ ఈగిల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇక రవితేజ.. దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్.
వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో నాలుగో సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ గోపీచంద్ – రవితేజ కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్. హిట్ సినిమాలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి తర్వాత మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సూపర్ హిట్ పక్కా అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నట్టు ఇండస్ట్రి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా శ్రీలీలను అనుకున్నారు. శ్రీ లీల – రవితేజ కాంబినేషన్లో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది.
శ్రీలీల బిజీగా ఉండడంతో రష్మిక పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఇప్పుడు వీరిద్దరిని కాదని రాశి ఖన్నాను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రాశీఖన్నా మెయిన్ హీరోయిన్నా సెకండ్ హీరోయిన్నా అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ రాశీఖన్నా మెయిన్ హీరోయిన్ అయితే ఆమె పెద్ద ఐరన్ లెగ్ అని.. ఆమె ఎంపిక విషయంలో పెద్ద తప్పు అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. మరి మేకర్స్ రాశీఖన్నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.