టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులు ఇటీవల నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించిన విషయం తెలిసిందే. నార్కోటికి బ్యూరో కేసు ఆధారంగా ఈడి నవదీప్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన నవదీప్ ను విచారణకు హాజరు కావాలని తన నోటీసులో పేర్కొంది.
ఏడాది సెప్టెంబర్ 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లపై దాడి చేశారు. ఈ దాడిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు తో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రకరకాల డ్రగ్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వాళ్ళను విచారించగా.. వారు నవదీప్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అరెస్ట్ అయిన ఆ నలుగురిలో రామచంద్ర అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ లావాదేవీలు జరిపినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రగ్ కేసులో నటుడు నవదీప్ ని నిందితుడిగా చేర్చిన పోలీసులు ఇటీవల అతడిని విచారించారు. ఇదిలా ఉంటే నవదీప్ తో పాటు టాలీవుడ్ కి చెందిన మరో స్టార్ డైరెక్టర్ కూడా ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.
అతడి పేరు కూడా గతంలో డ్రగ్స్ విషయంలో తెరమీదకు వచ్చింది. మరోసారి డ్రగ్స్ కు ఆ స్టార్ డైరెక్టర్ కు లింకులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆ స్టార్ డైరెక్టర్ ను కూడా మరోసారి విచారిస్తారని.. ఈసారి అతడు అడ్డంగా బుక్కయ్యే ఛాన్సులు ఉన్నట్టు కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.