టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి గత రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాం సుందర్ రెడ్డి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. శ్యాంసుందర్ రెడ్డి – ప్రమీలమ్మ దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరే దిల్ రాజు. మిగిలిన ఇద్దరు విజయసింహారెడ్డి – నరసింహారెడ్డి.
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి కావటం విశేషం. అయితే చిన్నతనం నుంచి కుటుంబంలో వారంతా రాజును.. రాజు అని ముద్దుగా పిలిచేవారు. చివరికి అందరికీ రాజు అనే పేరు అలవాటు అయింది. ఆ తర్వాత ఆయన హైదరాబాదులో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాపు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పంపిణీదారుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. పంపిణీదారుగా సూపర్ హిట్ అయిన దిల్ రాజు నిర్మాతగా మారారు.
2003లో వివి. వినాయక్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తొలి సినిమా దిల్. ఈ సినిమాలో నితిన్ హీరో. దిల్ సూపర్ హిట్ అవడంతో రాజు పేరు కాస్త దిల్ రాజుగా ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయింది. ప్రస్తుతం రాజు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతిపట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.