మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిలో ఇప్పటికే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఆగస్టులో భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలలో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాగా.. భోళా శంకర్ చిరంజీవి కెరీర్లోనే ఏపీకి అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కెరీర్లో 156 సినిమా కూడా పట్టాలెక్కించేశారు. చిరంజీవి 156 సినిమా ఇటీవల వైభవంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
యూవి క్రియేషన్స్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మెగాస్టార్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుండగా ముల్లోక వీరుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అలాగే విశ్వంభర అనే మరో టైటిల్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ ఇద్దరు హీరోయిన్లు గతంలో చిరంజీవితో పని చేసిన వారే. అనుష్క శెట్టి స్టాలిన్ సినిమాలో చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్ లో నటించింది. కాజల్ అగర్వాల్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరుకి జోడిగా నటించింది.
అలాగే ఈ ఇద్దరు హీరోయిన్లు బాలయ్యతో నటించారు. అనుష్క ఒక్క మగాడు సినిమాలో జోడి కట్టగా కాజల్ రీసెంట్గా వచ్చిన బాలయ్య బ్లాక్బస్టర్ భగవంత్ కేసరి సినిమాలో నటించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పక్కన కాజల్ తన వయసుకు తగిన పాత్రలో నటించి బాగా క్లిక్ అయింది. అందుకే ఇప్పుడు చిరంజీవి పక్కన కూడా వయసుకు తగినట్టుగా కాజల్ మ్యాచ్ అవుతుందని ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.