అక్కినేని నాగేశ్వరరావు, జమునా రాణి కలిసి నటించిన అనేక చిత్రాల్లో అపురూపమైన క్లాసికల్ మూవీ మురళీ కృష్ణ. చిన్నపాటి అపార్థం నిండు కుండ వంటి కుటుంబాన్ని, కాపురాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. ప్రేమ-సెంటిమెంటు – అనుమానం – అపార్థం అనే ఈ నాలుగు పిల్లర్లతో అల్లిన కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.
నీసుఖమే నేకోరుకున్నా.. అనే విషాద భరిత పాట ఈ సినిమాలోదే కావడం విశేషం. ఎస్వీ రంగారావు, హరినాథ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా బడ్జెట్ కేవలం 10 లక్షలు. కానీ, వసూళ్లు మాత్రం 50 లక్షలు. ఇక, ఈ సినిమాకు సంబంధించి గమ్మత్తయిన విషయం ఒకటి ఉంది. వాస్తవానికి కథను భానుమతిని దృష్టిలో ఉంచుకుని రాశారట.
కథను కూడా ఆమెకు వివరించారు. ముందు ఆవిడ ఓకే చెప్పారు. మొత్తం సెట్ అయిపోయిందని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాక.. తమ సొంత బ్యానర్‌లో మరో కథను కూడా అప్పుడే ప్రారంభిం చాలని భానుమతి భర్త రామకృష్ణ చెప్పారు. మురళీకృష్ణ విషయం ఆయనకు తెలియదు. దీంతో ఆయన ఇలా అనుకునే సరికి ఏం చేయాలో ? తెలియక భానుమతి ఇబ్బంది పడ్డారు.
ఇదే విషయాన్ని అక్కినేనితో చెప్పారు. దీంతో ఆయన మీరేమీ బాధపడక్కరలేదు. మీ సినిమా మీరు చేయండి.. మిగిలింది నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారట. ఇలా.. మురళీ కృష్ణ సినిమాలో జమునను బుక్ చేసుకున్నారని అప్పటి రచయిత ముళ్లపూడి వెంకటరమణ రాసుకున్నారు.