సూపర్ స్టార్ కృష్ణ రెండో సతీమణి విజయనిర్మల ఎంత గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు అంటే నిజంగా ఇది తెలుగు ప్రజలు అందరికీ గర్వకారణం అని చెప్పాలి.
ఇక విజయనిర్మల- కృష్ణ వివాహం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కృష్ణ తన సొంత మరదలు ఇందిరను వివాహం చేసుకున్నారు. విజయనిర్మలకు మరో వ్యక్తితో వివాహం జరగగా అప్పటికే ఆమెకు సురేష్- నరేష్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత కృష్ణ – విజయనిర్మల వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ముఖ్యంగా సాక్ష్యం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రేమ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్టేజ్ కు రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ కమెడియన్ రాజబాబు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సరదాగా అన్నారట. ఆ తర్వాత అదే నిజం అయింది.
తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొద్దిమంది సన్నిహితులు సినిమా వాళ్ళ సమక్షంలో కృష్ణ, విజయనిర్మల పెళ్లి జరిగింది. ముఖ్యంగా వీరి పెళ్లి పెద్దగా సీనియర్ హీరో చంద్రమోహన్ వ్యవహరించారట. తిరుపతిలో వీరి పెళ్లి చంద్రమోహన్ దగ్గరుండి మరి ఏర్పాట్లు చేసి జరిపించారు. అందుకే చంద్రమోహన్ అంటే ఇటు కృష్ణకు అటు విజయనిర్మలకు ఎంతో అభిమానం. వారిద్దరూ చనిపోయే వరకు చంద్రమోహన్ అంతే అభిమానంతో ఉండేవారు.