మహిళలకు హ్యాండ్ బ్యాగులు చాలా ప్రత్యేకం. మధ్యతరగతి మగువల నుంచి హైక్లాస్ లేడీస్ వరకు హ్యాండ్ బ్యాగులు అంటే ఇష్టపడని వారు ఉండరు. అది కూడా ఒక బ్యాగ్ తో సర్దుకుపోయేవారు తక్కువగానే ఉంటారు. ఇక ఉద్యోగినిలు అయితే తమ డ్రెస్‌లకు మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్‌లు కూడా వాడుతూ ఉంటారు. ఈ హ్యాండ్ బ్యాగులు కొనేందుకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఖర్చు చేస్తూ ఉంటారు.
ఇక హీరోయిన్లు.. సెలబ్రిటీ మహిళ ఇందుకు మినహాయింపు కాదు. వారి రేంజ్ కు తగ్గట్టుగా వారు హ్యాండ్ బ్యాగ్‌లు కొనేస్తూ ఉంటారు. అందులోనూ మీడియా కళ్ళు వారి హ్యాండ్ బ్యాగులపై ఉంటాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిందే. స్టైల్ స్టైల్ గా ఉండాల్సిందే. ఇందుకోసం స్టార్ హీరోయిన్లు భారీ మొత్తలను ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి జాబితాలోనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా నిలుస్తుంది.
ఆమె ఎప్పటికప్పుడు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు వేసుకుని పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటుంది. కరీనా తన హ్యాండ్ బ్యాగుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందట. ప్రాన్స్ – ఇటలీ – జర్మనీ లాంటి దేశాల నుంచి లెదర్ బ్యాగులను ఆమె ఇంపోర్ట్ చేసుకుంటారట. ఒకే బ్రాండ్లో కూడా కనీసం నాలుగు లక్షల రూపాయలతో మొదలుపెట్టి కోటి రూపాయలు పలికే బ్రాండ్లు ఉంటాయి.
ఇలాంటి వాటిల్లో కరీనాకపూర్ వద్ద ఏకంగా 20 కు పైగా బ్యాగులు ఉన్నాయని.. ఆమె వాటిని ధరించి కనిపించడాన్ని బట్టి తెలుస్తోంది. వీటి ధర కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా. కరీనా వద్ద ఉన్న అన్ని హ్యాండ్ బ్యాగ్‌ల కలెక్షన్ల మొత్తం విలువ మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. కరీనాకు ఈ విషయంలో మంచి పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా బాలీవుడ్లో లేరట.