మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఒక దశకంలో బ్రేక్ డ్యాన్స్ సహా.. స్టెప్పులతో కూడిన డ్యాన్స్‌కు పెట్టింది పేరు. చిరు స్టెప్పులు రికార్డు చేసేందుకు పది కెమెరాలను వినియోగించిన సినిమాలు కూడా ఉంటాయంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆయన పక్కన నటించే హీరోయిన్లు కూడా అంతే వేగంగా డ్యాన్స్ చేయాలి. ఇలా చూసుకున్నప్పుడు హీరోయిన్లకు ఇబ్బంది ఉండేది. రాధ, రాధిక ఉన్నా.. కొన్నిసినిమాలకే వారు పరిమితం అయ్యారు.
కానీ, భానుప్రియ మాత్రం.. చిరుతో ఎలాంటి డాన్స్‌కైనా సై అనేదట. తనకు భరత నాట్యం, కూచిపూడి సహా వెస్ట్రన్ స్టయిల్ డ్యాన్స్‌లపైనా పట్టు ఉండడంతో ఆమెకు మంచి ఆదరణ లభించింది. ఇలాచిరు పక్కన పదుల సినిమాల్లో నటించి మంచి డ్యాన్సర్‌గానే కాకండా.. చిరుకుపోటీ ఇచ్చారని చెబుతారు. చిరంజీవి అగ్ర నాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు.
వారిద్దకి జోడీ ఎంతో సక్సెస్ అనే పేరు వచ్చింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు. ఆమె భరత నాట్యం చూసి చిరంజీవికే ముచ్చెమటలు పట్టాయన్న చర్చలు కూడా అప్పట్లో ఉండేవి. అదేవిధంగా బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది.
బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో కథానాయకుడు వెంకటేష్ తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి.