సాధారణంగా సినిమా షూటింగులకు వచ్చే హీరోలు, హీరోయిన్లు.. నిర్దేశిత సమయానికి లేటుగా వచ్చి.. ముందుగా వెళ్లిపోవడం అలవాటు. ఎందుకంటే ఒకే రోజు రెండు మూడు షూటింగులు ఉంటే ఇలానే చేసే వారు, ఇక, షూటింగులు లేకపోయినా.. ఇదే అలవాటు కొనసాగింది. దీంతో నిర్మాతలు కొంత ఇబ్బంది పడేవారు. ఇదిలావుంటే.. అక్కినేని నాగేశ్వరరావు అగ్రనటుడిగా కొనసాగుతున్న సమయంలో చిత్రమైన పని చేసేవారు.
ఆయన ఏ సినిమా అయినా.. చాలా ముందుగానే షూటింగు స్పాట్‌కు వచ్చేవారు. అదేవిధంగా షూటింగ్ ముగిసిన తర్వాత.. చాలా లేటుగా వెళ్లేవారు. ఇది.. చాలా మంది గుర్తించలేదు. అయితే, దర్శకుడు ప్రత్యగాత్మ మాత్రం గుర్తించారు. అక్కినేని ఇలా.. ముందుగానే రావడం.. ఆలస్యంగా వెళ్లడం ఏంటని.. తరచుగా అడిగేవారు. అయితే.. అక్కినేని మాత్రం మౌనంగానే ఉండిపోయేవారు. చిరునవ్వు రువ్వి వదిలేసేవారు.
అయితే.. తర్వాత.. తర్వాత..అక్కినేని ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయం బయట పడింది. ఆ సమయంలో అంటే.. 1980లలో అక్కినేని దర్శకత్వం వైపు మొగ్గు చూపాలని.. సొంతగానే సినిమాలు చేయాలని భావించారు. అయితే.. ఆయన నష్టాలకు దూరంగా ఉండాలని భావించేవారు. ఎక్కడా నష్టం వచ్చే పనిని చేయకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన లక్ష్యం.
ఈ క్రమంలోనే తాను దర్శకుడు అయితే.. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాలనే విషయాన్ని ఆయన అధ్య యనం చేసేవారట. అదేసమయంలో లాభాలపై కూడా అంచనావేసుకునేందుకు ముందుగానే షూటింగ్ స్పాట్‌లకువచ్చి.. నెమ్మదిగా వెళ్లేవారట. ఈ మధ్యలో అందరినీ ఓ కంట కనిపెడుతూ.. లాభాలను అంచనా వేసుకునేందుకు ఇలా ఓ కన్నేశారనే చర్చ సాగింది. తర్వాత.. అక్కినేని దర్శకత్వం జోలికి పోలేదు. దీనిని బట్టి కష్టాలే ఎక్కువని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.