జీవితం అన్నాక కాసింత పస ఉండాలనేది ఎన్టీఆర్ సిద్ధాంతం. ఆయన అలానే వ్యవహరించారు. ఇక, మరో అగ్రతార అక్కినేని నాగేశ్వరరావు మాత్రం జీవితం అన్నాక లౌక్యం ఉండాలి తప్ప.. మరేమీ కాదని తేల్చి చెప్పేసేవారు. ఎవరి పంథాలో వారు నడిచినా.. అక్కినేనిని తమ్ముడు అని అన్నగారు ఆప్యాయంగా పిలిస్తే.. అన్నయ్యా.. అంటూ అక్కినేని కూడా రామారావుతో కలిసి నడిచారు.
అనేక సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అయితే.. సాహసం విషయానికి వస్తే మాత్రం అక్కినేని దూరంగా ఉండేవారు. కేవలం సినిమా రంగమే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ అక్కినేని సాహసాల జోలికి పోలేదు. తను సంపాయించుకున్న ప్రతిరూపాయినీ జాగ్రత్త చేసుకుని, ఆర్థిక వనరులు పెంచుకునేందు కు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం సాహసాలకు చిరునామాగా మారారు.
ఏదైనా తనకు నచ్చిన సినిమాను ఎవరూ చేయకపోతే.. ఆయనే చేసేవారు. తనే నిర్మాతగా రంగంలోకి దిగేవారు. నష్టాలు కష్టాలను కూడా భరించారు. ఇలా.. ఆయన తీసిన అనేక సినిమాలు ఉన్నాయి. దానవీరశూరకర్ణ సినిమా అందరికీ తెలిసిందే. కానీ, దీనికి ముందు శ్రీకృష్ణ పాండవీయం సినిమాను తీశారు. వాస్తవానికి ఈ సినిమా వేరే బ్యానర్‌పై చేయాలని అనుకున్నారట.
కానీ, ఇప్పటికే అనేక కథలు శ్రీకృష్ణుడి చుట్టూ వచ్చాయని.. కాబట్టి ఇది వద్దని సదరు బ్యానర్ నిర్మాత తేల్చి చెప్పారు. కానీ, అన్నగారి మనసులో మాత్రం శ్రీకృష్ణ పాండవీయం ముద్రవేసింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి సినిమా తీశారు. ఇది హిట్ అయింది. అలానే రాజకీయాలు కూడా. రంగులు వేసుకునేవారు రాజకీయాలు చేస్తారా? అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని అన్నగారు పార్టీ పెట్టారు. గెలిచారు. సో.. మొత్తంగా అక్కినేని-ఎన్టీఆర్‌లలో ఈ తేడా స్పష్టంగా కనిపించేది.