తాతా-మనవడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన సినిమా. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దర్శకుడు దాసరి నారాయణరావుకు ఇది తొలి చిత్రం. ఈ సినిమాతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు దాసరి ఆ తర్వాత టాలీవుడ్‌లోనే పెద్ద దిగ్గజ దర్శకులులో ఒకరుగా ఎదిగారు. ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక ఈ తాతా మనవడు సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల చేశారు.
ఎందుకంటే.. బలమైన హీరో ఎవరూ లేరు. పైగా అప్పటి వరకు హాస్య నటుడిగా గుర్తింపు పొందిన రాజబాబును ఈ సినిమాలో హీరోగా పరిచయం చేశారు. అంతేకాదు.. దీనికి ముందు హీరోయిన్‌గా చేసిన అంజలీదేవిని ఇందులో వృద్ధురాలిగా చూపించారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. అదేవిదంగా విజయనిర్మల ఎప్పుడూ.. యంగ్ హీరోలతో పనిచేసింది.
కానీ, ఈ సినిమాలో రాజబాబు సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఎక్కడా.. కూడా యువళగీతాలు లేవు. ఒక కుటుంబానికి సంబంధించిన స్టోరీ. కన్నబిడ్డ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం చుట్టూ తిరిగే కథ. దీంతో పెద్దగా అంచనాలేవీ లేకుండానే ఈ సినిమాను విడుదల చేశారు. కానీ, దాదాపు ఏడాది పాటు ఈ సినిమా ఆడేసింది.
అయితే.. సినిమా హిట్టయినా.. అప్పటి వరకు అంజలీదేవికి హీరోయిన్ పాత్రలు బాగా తగ్గిపోయాయి. దీంతో చాలా రోజులు ఆమె ఎదురు చూడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె దాసరితో చెబుతూ.. మీ వల్ల నేను నష్టపోయాను.. అన్నారట. దీనికి దాసరి తెలివిగా.. తల్లి అంటే అంతే అమ్మా.. తను నష్టపోయినా.. బిడ్డలకు జీవితాన్ని ప్రసాదిస్తుంది. నాకు మీరు జీవితాన్ని ఇచ్చారు అన్నారట.