టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హీరో సినిమా అయినా తప్పుకుని దారిచ్చేస్తూ ఉంటాయి. అందులోనూ పవన్ కళ్యాణ్‌కు తోడుగా మరో హీరో కూడా ఉన్నాడంటే అసలు ఆ సినిమాపై అంచనాలు ఎలా ? ఉండాలి. వార్ వన్‌సైడ్ అయిపోవాలి. అయితే పవన్ – సాయిధరమ్ కలిసి నటించిన బ్రో సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే చాలా సినిమాలు థియేటర్లలోకి క్యూ కట్టేశాయి.
బ్రో సినిమా అంచనాలు అందుకోలేదు. ఇది వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే పరిస్థితి లేదు. సోమ, మంగళవారాలకే బ్రో సినిమా సత్తా ఏంటో తెలిసిపోయింది. దీంతో ఈ వారం ఏకంగా 10కు పైగా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మల్టీఫ్లెక్స్, పేరున్న థియేటర్లలో కూడా బ్రో సినిమాకు నాలుగో రోజుకే సగం సీట్లు కూడా నిండని పరిస్థితి.
వెస్ట్ గోదావరిలో సీ సెంటర్ల పరిస్తితి మరీ ఘోరం. నల్లజర్ల లాంటి మల్టీఫ్లెక్స్ ఉన్న చోట్ల బుక్‌మై షోలో కూడా టిక్కెట్లు పెట్టలేదు. జంగారెడ్డిగూడెం, ఏలూరులో సింగిల్ స్క్రీన్లో మాత్రమే బ్రో ఆడుతోంది. ఇప్పటికే సినిమా చూడాల్సిన పవన్ ఫ్యాన్స్ చూసేశారు. ఇక సగటు సినీ అభిమానులు ఈ సినిమా చూడాలన్న ఆతృతతో లేరు. దీంతో బ్రో సీన్ దాదాపు అయిపోయినట్టే.
అందుకే ఇప్పుడు ఈ వీకెండ్‌లో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాకు కూడా నైజాంలో భారీగా థియేటర్లు దక్కాయంటే బ్రో సినిమాను ఎలా లేపేస్తున్నారో తెలుస్తోంది. ధోనీ నిర్మించిన ఎల్.జి.ఎమ్ అనే సినిమాకు కూడా భారీగా స్క్రీన్లు వేశారు. ఇవన్నీ కూడా బ్రో సినిమా లేపేసిన స్క్రీన్లే. అదే బ్రో బ్లాక్‌బస్టర్ హిట్ అయితే అసలు ఈ సినిమాలను పట్టించుకునే వాళ్లే ఉండరు.
ఇటు బ్రో సినిమా కొన్న బయ్యర్లు కూడా 25 – 30 శాతం రేషియోలో నష్టపోక తప్పదని నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇక వచ్చే వీకెండ్ చిరు భోళాశంకర్ వస్తోంది. అప్పటకి బ్రో కంప్లీట్గా థియేటర్ల నుంచి లేపేస్తారు. ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర బ్రో ఏదేదో సంచలనం నమోదు చేస్తుందని ఆశించడం కూడా అత్యాశే కానుంది.