మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నుంచి చిరు లీక్స్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి. చిరంజీవి బ్రహ్మాజీ కుమారుడి సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ అనుకోకుండా టైటిల్ బయట పెట్టేశారు. అప్పట్నుంచి చిరు లీక్స్ ట్రెండ్ అలా నడుస్తూనే ఉంది. తాజాగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా చిరు లీక్స్ తతంగం నడుస్తోంది. అయితే భోళా శంకర్ సినిమా గురించి ఇప్పటివరకు చిరంజీవి చేసిన లీకులు అన్ని పక్కా స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. చిరంజీవి లీక్ చేసిన కంటెంట్ గురించి తమకు అస్సలు తెలియదని చెబుతోంది యూనిట్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసే సీన్ చిరంజీవి కావాలనే లీక్ చేశారట. ఆ విషయం దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు ఎవరికీ తెలియదట. ఎడిటర్‌కు చెప్పి దగ్గరుండి చేయించుకుని చిరంజీవి స్వయంగా బయటికి వదిలేసారట.
పైగా నాకు తెలిస్తే గొడవ అవుతుందేమో అని అంటూనే ఏం పరవాలేదులే లీక్ చేసేయ్ అని.. వదిలేశారని మెహర్ రమేష్ చెప్పారు. విదేశాల్లో ఉన్నప్పుడు తమన్నాకు తెలియకుండానే కొన్ని విజువల్స్ షూట్ చేయించి మరి లీక్ చేయించారని మిల్కీ బ్యూటీ చెబుతోంది. ఇక సుశాంత్ కూడా ఇదే మాట చెపుతున్నాడు. “జాం జాం జజ్జనక” సాంగ్ సెట్ బాగుందని సుశాంత్ కొన్ని ఫొటోలు తీసుకుంటే వద్దు అని చిరు చిన్న వార్నింగ్ ఇచ్చారట.
ఇవి సినిమాలో చాలా కీలకం అని.. ఆ ఫొటోలు బయటపెట్టొద్దని అన్నారట. తర్వాత కొద్ది రోజులకు చిరుయే స్వయంగా వాటిని లీక్ చేశారట. దీంతో అసలు తమకు తెలియకుండానే చిరు లీకులు చేసేస్తున్నారని.. మమ్మలను పిచ్చోళ్లను చేస్తున్నారని వారు తలలు పట్టుకుంటున్నారు.