సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మాస్ యాక్షన్.. కమర్షియల్ ఎంటర్టైనర్ లో రజనీకాంత్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మరో కీలక పాత్రలో మెప్పించారు. ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు మోహన్‌లాల్ – శివరాజ్ కుమార్ – జాకీష్రాఫ్ వంటి వారు ప్రత్యేక పాత్రలలో నటించారు.
అలాగే వసంత రవి – వినాయక – నాగబాబు – యోగిబాబు – తెలుగు కమెడియన్ సునీల్ తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలలో మెప్పించారు. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆగస్టు 10 న పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చిన జైలర్ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే అదిరిపోయే టాక్ రావడంతో పాటు సూపర్ కలెక్షన్లతో జైలర్ దూసుకుపోతోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అటు తమిళంలో మాత్రమే కాదు.. ఇటు తెలుగులో సైతం జైలర్ మాస్ ర్యాంపేజ్ ఆడుతోంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో తెలుగులో కూడా మెజార్టీ ఆడియన్స్ జైలర్ ఆడుతున్న థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే చాలా చోట్ల భోళాశంకర్ సినిమాను ఎత్తివేసి ఆ థియేటర్లు కూడా జైలర్‌కు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జైలర్ సినిమా రు. 400 కోట్ల గ్రాస్ మార్కుని దాటేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో జైలర్ మరింత మాస్ ర్యాంపేజ్ ఆడటం ఖాయమని.. రజినీ కెరీర్ లోనే కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ మూవీగా నిలిచే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.