సాధారణంగా ఒక సినిమాకు ఒక దర్శకుడు ఉంటారు. అయితే, అనివార్య కారణాలతో అన్నగారు నటించిన లవకుశ చిత్రానికి, అదేవిధంగా హీరో కృష్ణ నటించి, నిర్మించిన అల్లూరి సీతారామరాజు సినిమాకు మాత్రం ఇద్దరేసి చొప్పున దర్శకులు మారారు. లవకుశ సినిమా దర్శకుడు మధ్యలోనే చనిపోగా.. ఆయన కుమారుడు రెండేళ్లకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. ఇక, అల్లూరి సీతారామరాజు విషయంలోనూ దర్శకుడు చనిపోయారు. తర్వాత.. మరో దర్శకుడికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు.
కానీ, విజయనిర్మల వద్దని చెప్పడంతో హీరో కృష్ణ దర్శకుడిగా మారి సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా పూర్తిగా ఆయన చేతుల మీదే జరిగినా.. ఎక్కడా ఆయన పేరు దర్శకుడిగా మాత్రం ఉండదు. ఇదిలావుంటే.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక సినిమాను ఆరుగురు దర్శకులు దర్శకత్వం వహించారు. దీనికి కారణం .. వారు చనిపోవడం కాదు.. ఈ సినిమాలో హీరోగా నటించిన సీ ఎస్ ఆర్ ఆంజనేయులు, నిర్మాతలతో పడకపోవడంతో దర్శకులు టపటపా మారిపోయారు.
అదే.. బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన భక్తతుకారం సినిమా. దీనిని తర్వాత కాలంలో దుక్కిపాటి మధుసూదన రావు.. అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి పెట్టి మళ్లీ తీశారు.కానీ, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆడినట్టుగా ఈ సినిమా ఆడలేదని చెబుతారు. కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియోస్ తెలుగు, తమిళభాషల్లో ‘భక్తతుకారాం’ నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుగురు దర్శకులు.
ఒకరితరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆరో ఆయన పూర్తిచేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ తమిళంలోనూ, సిఎస్ ఆర్ ఆంజనేయులు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి నటించారు. రెండు భాషల్లోనూ 1941-42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి.