ఒకేఒక్క సినిమా ఐదుగురు కెరీర్‌కు కీలకం కానుంది. ఈ సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ఈ ఐదుగురి కెరీర్ దాదాపు డేంజర్ జోన్‌లో పడ్డట్టే..! ఆ ఐదుగురు ఎవరో కాదు నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్, హీరో… మెగాస్టార్ చిరంజీవి, ఇంకా.. తమన్నా.. సుశాంత్. ఆ సినిమాయే భోళాశంకర్. అప్పుడెప్పుడో 2013లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన షాడో లాంటి డిజాస్టర్ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు దర్శకుడు మెహర్ రమేష్.
ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత అది కూడా అప్పుడెప్పుడో తమిళంలో ఆరేళ్ల క్రిందట వచ్చిన వేదాళం లాంటి కుక్క రాడ్ సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మెహర్ ప్రూవ్ చేసుకుంటేనే టాలీవుడ్‌లో ఉంటాడు. లేకపోతే ఇప్పటికే అందరూ మర్చిపోయిన మెహర్ రమేష్ పేరు ఇక ఎవ్వరికి గుర్తుండదు. అసలు ఎవ్వరూ ఛాన్సులు కూడా ఇవ్వరు.
ఇక నిర్మాత అనిల్ సుంకర రీసెంట్‌గా అఖిల్‌తో ఏజెంట్ లాంటి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. బయ్యర్లు దారుణంగా కుదలేయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఆయన మరింత నష్టపోవడం ఖాయం. ఇక మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్ చివరి దశలో ఉంది. అయితే ఇప్పుడు రజనీకాంత్ జైలర్, చిరు భోళాశంకర్ ఒకే రోజు తేడాలో రెండు రిలీజ్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలు లేదా కనీసం చిరు సినిమా హిట్ అయితే ఆమెకు కొంత కాలం సీనియర్ హీరోల పక్కన ఛాన్సులు ఉంటాయి. లేకపోతే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సిందే. ఇక అక్కినేని హీరో సుశాంత్‌కు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరైన హిట్ లేదు. ఈ సినిమా హిట్ అయితే కనీసం ఇలాంటి పాత్రలు అయినా పడుతుంటాయి. లేకపోతే ఇక లేనట్టే ఉంటుంది.
ఇక చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సైరా, ఆచార్య, గాడ్‌ఫాధర్‌తో ఎదురు దెబ్బలు తిన్నారు. వాల్తేరు వీరయ్య హిట్ అయ్యింది. ఆ ట్రాక్ కంటిన్యూ చేయాలన్నా.. వీరయ్య విజయం గాలి వాటం కాదని ఫ్రూవ్ చేసుకోవాలన్నా ఈ సినిమా హిట్ తప్పనిసరి. అందుకే ఈ ఒక్క సినిమా ఏకంగా ఐదుగురు కెరీర్‌లను డిసైడ్ చేయనుంది.