మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏళుతున్న స్టార్ హీరో. ఎన్టీఆర్ – ఏఎన్నార్ తర్వాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక నటుడు చిరంజీవి మాత్రమే. 67 ఏళ్ల వయసులో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్న చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసిరుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన చిరంజీవి ఆరు నెలల గ్యాప్ లోనే భోళాశంకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంకా చెప్పాలి అంటే చిరంజీవి స్థాయికి తగినట్టుగా కూడా ఈ సినిమా లేదని.. మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇక రీమేక్స్ సినిమాల జోలికి వెళ్లవద్దని చిరంజీవికి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి కొద్దిరోజులుగా మోకాలు నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోని ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిరంజీవి మోకాలికి సర్జరీ జరిగింది. మరో వారం రోజులపాటు ఆయన ఢిల్లీలో వైద్యులకు పర్యవేక్షణలోనే విశ్రాంతి తీసుకుంటారు. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్‌కు వస్తారు. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత మూడు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారట.
అసలు భోళాశంకర్ ప్రమోషన్ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సర్జరీ చేయించుకోవాలని చిరంజీవి భావించారు. అయితే చిరంజీవికి జరిగిన ఈ సర్జరీ చాలా చిన్నదని.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ను టెక్నాలజీ ఉపయోగించి నిమిషాల వ్యవధిలోని పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి రోజులాగే నడవడంతో పాటు.. తన పనులు తాను చేసుకుంటున్నారట. వారం రోజుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత తన షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది.