నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ తర్వాత బాలయ్యకు ఇది వరుసగా రెండో విజయం. పైగా చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పోటీగా వచ్చి బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఎక్కువ లాభాలు వచ్చేలా చేయటం ఆయన మానియాకు నిదర్శనం. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి దిగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే యువ దర్శకుడు బాబితో బాలయ్య ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువనిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ నిర్మించబోతున్నారు. ఈ సెట్లోనే బాలయ్యకు, సింహం మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్ షూట్ జరుగుతుందని తెలుస్తోంది.
సింహంతో బాలయ్యకు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మంచి హైలెట్‌గా ఉండబోతుందని సమాచారం. ఇక బాబి కూడా బాలయ్య ఇమేజ్‌కు తగినట్టుగా అదిరిపోయే పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా స్టోరీ రెడీ చేశాడట. ఇటు యాక్షన్లతోపాటు సీక్వెన్స్ తో పాటు అటు అదిరిపోయే ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంటు కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో యాక్షన్ కంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు కలిసి వచ్చినట్టుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమన్నాను ఒక హీరోయిన్గా అనుకుంటున్నారు. మరో హీరోయిన్ పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలకు ముందే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.