టైటిల్: సామజవరగమన
నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
నిర్మాత: రాజేష్ దండా
దర్శకుడు : రామ్ అబ్బరాజు
రిలీజ్ డేట్ : జూన్ 29, 2023
పరిచయం:
వైవిధ్యమైన కథలకు.. మంచి కామెడీకి శ్రీ విష్ణు సినిమాలు కేర్ ఆఫ్ గా నిలుస్తూ ఉంటాయి. ఆ హీరో బలం కూడా అదే. అయితే ఇటీవల తన ఇమేజ్ మార్చుకునే క్రమంలో చేసిన మాస్ యాక్షన్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో శ్రీ విష్ణు తనకు బాగా కలిసి వచ్చిన కామెడీ ట్రాకులోకే వెళ్లిపోయాడు. వివాహ భోజనంబు సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి తాజాగా శ్రీ విష్ణు నటించిన సినిమా సామజ వర గమన. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ షోలు పడిపోయాయి. మరి ఈ సినిమా ఎలా ? ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
బాలు ( శ్రీ విష్ణు ) ఏషియన్ మల్టీప్లెక్స్ ఉద్యోగి. సంపాదించే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టే మనస్తత్వం ఉన్న మనిషి. తన తండ్రి ఉమామహేశ్వర రావు ( సీనియర్ నరేష్ ) ను డిగ్రీ పాస్ చేయించేందుకు అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు. ఎందుకంటే నరేష్ డిగ్రీ పూర్తి చేస్తేనే తన తాత వీలునామా ప్రకారం ఈ కుటుంబానికి కోట్లాది రూపాయల ఆస్తి చేతికి వస్తుంది. తండ్రితో డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు రాయిస్తున్న క్రమంలో సరయు ( రెబా మౌనికా జాన్ ) తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.
ముందు సరయు.. బాలు ఇంట్లోకి పేయింగ్ గెస్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక బాలు తనకు ఐ లవ్ యు చెప్పిన ప్రతి అమ్మాయితో బలవంతంగా రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. అలాంటి బాలు సరయుతోనే ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రణాళిక కూడా వేస్తారు. అయితే విచిత్రంగా సరయు అక్కకు బాలు బావకు పెళ్లి కుదురుతుంది. దీంతో వీరి ప్రణాళిక మొత్తం రివర్స్ అవుతుంది. చివరకు వీళ్ళ ప్రేమ కథ ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాసై ఆస్తిని దక్కించుకున్నాడా ? లేదా అన్నది తెరమీద చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు తెరమీద నువ్వులు పూయిస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఈ సినిమా లైన్ చాలా చిన్నది. అయితే ఆ లైన్ కు చుట్టూ అల్లుకున్న సీన్లు చాలా కొత్తగా ఉంటాయి. మనం ప్రతి సినిమాలోని కొడుకు సరిగా చదవట్లేదు అంటూ తిట్టే తల్లిదండ్రులను చూస్తాము.. కానీ ఇందులో వెరైటీగా కొడుకే తండ్రిని చదువుకోమంటూ సతాయిస్తూ ఉంటాడు. తండ్రిని డిగ్రీ పాస్ చేయించేందుకు రకరకాల తిప్పలు పడుతూ ఉంటాడు. ఈ ప్రయత్నాలు మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.
సినిమా ఫస్ట్ అఫ్ అంత ఈ ట్రాక్ మీద ముందుకు వెళుతుంది. ఇక ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వయసులో డిగ్రీ పరీక్షలు రాస్తూ నరేష్ పడే ఇబ్బందులు కూడా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే తండ్రి కొడుకుల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు అన్నీ సరదాగా ఉంటాయి. హీరో ఇంట్లోకి కథానాయక పేయింగ్ గెస్ట్ గా ఎంటర్ అయ్యాక కథ మరో మలుపు తిరుగుతుంది. తన ఇంట్లోకి వచ్చిన సరయును బాలు ట్రీట్ చేసే విధానం.. అతడి ప్రవర్తనతో ఆమె పడే ఇబ్బందులు అన్ని ఫన్నీగా ఉంటాయి.
ఇక బాలు తనకు ఐ లవ్ యు చెప్పే ప్రతి అమ్మాయితో బలవంతంగా రాఖీ కట్టించుకోవడం కూడా సరదాగా ఉంటుంది. రాఖీ పండుగను ఎలా కమర్షియల్ గా మార్చారో బాలు చెప్పే తీరు కుర్రాళ్లతో విజిల్స్ వేయిస్తుంది. సరయుతో బాలు ప్రేమలో పడే సన్నివేశాలు కూడా చాలా కన్వెన్సింగ్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ కు ముందు వీళ్ళ ప్రేమ కథలో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్లో ఏం జరుగుతుందన్న ? ఆసక్తి కలిగిస్తుంది. తన బావ పెళ్లి వల్ల బాలు ప్రేమ కథకు చిత్రమైన సమస్య ఎదురు కావడంతో సెకండాఫ్ మొదలవుతుంది.
ఇక సరయు కుటుంబం వాళ్ళ పాత్రలని తీర్చిదిద్దిన విధానం.. వాళ్ళ అతి ప్రేమానురాగాలతో బాలు అతని కుటుంబం పడే ఇబ్బందులు అంతా నవ్వులు పూయిస్తాయి. ఇక బాలుకు రాఖీ కట్టించేందుకు సరయు తండ్రి తన కుటుంబంతో ఇంటికి వచ్చేసే హంగామా.. దాన్ని తప్పించుకునేందుకు బాలు పడే పాట్లు చాలా బాగుంటాయి. నిజానికి ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండాఫ్లో కాస్త స్లో అయినట్టు అనిపించినా ఈ కామెడీ సీన్లు ఎక్కడ బోరు కొట్టించకుండా సినిమాను లాగించేసాయి.
సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హంగామా హాయిగా నవ్విస్తుంది. ఇక ముగింపు మాత్రం ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉంటుంది. సినిమా ఆద్యంతం ఫన్ రాబట్టినా.. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా నడిపారు. అయితే కొన్ని కామెడీ సీన్లు మనం గతంలోనే కొన్ని సినిమాలలో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నటీనటులు పాత్రలు అన్నీ బాగా కుదిరాయి.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా చూస్తే దర్శికుడు రామ్ అబ్బరాజు కామెడీ సన్నివేశాలతో ఎక్కడ బోరు కట్టకుండా సినిమాను నడిపించాడు. గోపి సుందర్ రంధించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. చోట కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. నిర్మాత రాజేష్ దండ సినిమాకు తగినట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.
ఫైనల్‌గా…
సామజవరగమన అంటూ వచ్చిన ఈ కామెడీ , ఫ్యామిలీ మాంచి ఎంటర్టైనర్. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఎంచక్కా థియేటర్లలో ఎంజాయ్ చేసి రావచ్చు.
ఫైనల్ పంచ్: క్లీన్ యు హిట్
TL రేటింగ్ : 3.25/5