Movies‘అహింస’ మూవీ రివ్యూ : ప్రేక్షకులకు పెద్ద హింస..!!

‘అహింస’ మూవీ రివ్యూ : ప్రేక్షకులకు పెద్ద హింస..!!

సినిమా: అహింస
నటీనటులు: దగ్గుబాటి అభిరామ్, గీతిక తివారి, సదా, రజత్ బేడి తదితరులు
దర్శకుడు: తేజ
సంగీతం: ఆర్పీ పట్నాయక్
రిలీజ్ డేట్: 02-06-2023

దర్శకుడు తేజ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తెరకెక్కించే సినిమాల్లో ఏదో ఒక అంశం ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తేజ డైరెక్ట్ చేసిన ‘అహింస’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
అహింసను పాటించే వ్యక్తిగా రఘు(అభిరామ్) మనకు కనిపిస్తాడు. అయితే, ఓ కేసులో అతడు ఇరుక్కోవడం.. వేరే దారి లేకపోవడంతో హింసను ఆశ్రయిస్తాడు రఘు. ఈ క్రమంలోనే అతడు పలు కీలక విషయాలను తెలుసుకుంటాడు. అసలు రఘు ఏ కేసులో ఇరుక్కున్నాడు.. అతడిని ఈ కేసులో ఇరికించింది ఎవరు.. రఘు ఈ కేసు నుండి ఎలా బయటపడ్డాడు.. అనేది సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు తేజ మరోసారి తన మార్క్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కథనం లేకపోవడంతో ప్రేక్షకులకు ఈ సినిమా ఏమాత్రం కనెక్ట్ కాదు. తేజ గత సినిమాలలోని కంటెంట్‌ను మరోసారి ఈ సినిమాలో చూపెట్టాడనే భావన కలుగుతుంది. ఫస్టాఫ్‌లో హీరో పరిచయం.. అతడు నమ్మే అహింస కోసం ఏదైనా చేసే వ్యక్తిగా హీరోను చూపెట్టారు. అయితే, ఓ కేసులో అతడు ఇరుక్కోవడంతో, ఆ కేసు నుండి ఎలా బయటపడాలా అనే ఆలోచనలో ఉంటాడు. ఈ క్రమంలోనే హీరోయిన్‌తో ప్రేమలో పడటం కూడా జరుగుతుంది. అయితే, తనను కేసులో ఎవరు ఇరికించారా అనేది తెలుసుకునే క్రమంలో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

ఇక సెకండాఫ్‌లో హీరో తనను తాను నిర్దోషిగా నిరూపించుకునేందుకు పడే పాట్లు ప్రేక్షకులను విసిగిస్తాయి. సినిమా కథ మొత్తం సైడ్ ట్రాక్ కావడంతో, ప్రేక్షకులు తలలు పట్టుకుంటారు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో పస లేకపోవడంతో ఈ సినిమాకు ఎందుకు వచ్చామా అని అనుకుంటారు. ఎట్టకేలకే ఎండ్ కార్డ్ చూడగానే హమ్మయ్యా అంటూ థియేటర్ బయటకు వచ్చేస్తారు.

ఓవరాల్‌గా దర్శకుడు తేజ మరోసారి తన ఔట్‌డేటెడ్ కంటెంట్‌తో ప్రేక్షకులను విసిగించాడు అని చెప్పాలి. ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని చూసిన దగ్గుబాటి అభిరామ్‌కు తొలి సినిమాయే డిజాస్టర్‌గా మిగిలింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
దగ్గుబాటి అభిరామ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నా, కొన్ని సీన్స్‌లో అతడు హావభావాలను సరిగా పలికించలేకపోయాడు. అటు హీరోయిన్ అవంతిక దస్సానికి యాక్టింగ్‌లో జీరో మార్కులు పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోని పర్ఫార్మెన్స్‌తో ఆమె కనిపించింది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు తేజ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు చూస్తే, అసలు ఆయనేనా ఈ సినిమాను తీసింది అనుకుంటాం. ఏమాత్రం ఎంగేజింగ్ లేని కథను పట్టుకొచ్చి తన మార్క్ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బతీసుకున్నాడు. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఓకే.

చివరగా:
అహింస – ప్రేక్షకులకు పెద్ద హింస!

రేటింగ్:
1.75/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news