అన్నగారు ఎన్టీఆర్ ఎన్నో చిత్రాల్లో నటించారు. సొంతగా కూడా అనేక సినిమాలు చేశారు. అయితే.. అన్న గారు నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలను పరిశీలిస్తే.. పౌరాణిక కథలే ఎక్కువగా ఉంటాయి. శ్రీకృష్ణ పాండవీయం, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ తులాభారం, దానవీరశూరకర్ణ.. ఇలా చాలా చాలా సినిమాలు పౌరాణిక కథలతోనే ముడిపడ్డాయి.
ఈ క్రమంలో కొందరు అన్నగారిపై విమర్శలు సంధించారు. అన్నగారికి పౌరాణికాలు తప్ప.. సాంఘిక సినిమాలు అచ్చిరాలేదని. ఇది పెద్ద రచ్చకు దారితీసింది. ఈ విషయాన్ని అన్నగారి సోదరుడు త్రివిక్రమ రావు.. ఎన్టీఆర్ చెవిలో వేశారు. దీంతో తల్లా-పెళ్లామా! అనే సినిమాను సొంత కథతో నిర్మించారు అన్నగారు. ఇది సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు.. అప్పటి కుటుంబ సంబంధాలను కూడా స్పష్టం గా చూపించారు.
అయితే.. ఈ సినిమా తర్వాత కూడా.. ఎక్కువగా అన్నగారు సాంఘికాల జోలికి పోలేదు. అంటే.. ఆయన ఇతర డైరెక్టర్లు, నిర్మాతలు అడిగితే మాత్రం చేసేవారు. కానీ, తాను మాత్రం స్వయంగా తీసేవారు కాదు. ఇదే విషయంపై అన్నగారిని ఓ మీడియా ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి అన్నగారు చెప్పిన సమాధానం ఆయనకు చరిత్రపైనా.. దేశ హిందూ పౌరాణికాలపైనా ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది.
ఇంతకీ అన్నగారి చెప్పిన విషయం ఏంటంటే.. సాంఘిక సినిమాలు ఎవరైనా చేస్తారు. ఎవరైనా తీస్తారు. కానీ, పౌరాణికాలు.. తీయాలంటే.. కొంత గట్స్ ఉండాలి. అవి ఖర్చుతో కూడిన పనే అయినా.. విజయం సాధిస్తాయా? లేవా? అనే సందేహాలు కూడా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వాటి జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు. మరి చరిత్ర ప్రజలకు, భావితరాలకు ఎలా అందుతుంది. అందుకే నేను ప్రయత్నం చేస్తున్నాను
అని చెప్పారు. ఇదీ.. ఎన్టీఆర్ విజన్ అంటే.