తెలుగు ఇండస్ట్రీలో వ్యసనాలు ఎక్కువనే పేరు ఇప్పటి కంటే కూడా 70-80ల మధ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు పెద్దగా లేదనే చెప్పాలి. అప్పట్లో వార్తలు రాసేవారికి ఎవరూ పెద్దగా డబ్బులు ఇచ్చేవారు కాదు. దీంతోవ్యక్తిగత విషయాలు గుప్పుమనేవి. ఇలా.. అప్పటి వార్తల్లో వ్యక్తిగత విషయాల జోక్యం ఎక్కువగా ఉండడంతో తారల వ్యసనాలపై అనేక కథనాలు వచ్చాయి.
ఎస్వీ రంగారావు మందు తాగి సినిమా షూటింగులకు వచ్చేవారని.. రాజబాబు అయితే.. షూటింగ్ గ్యాప్‌లోనే నాలిక తడుపుకొనే వారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. ఇక, రాజనాల అయితే.. డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు పీల్చేసేవారని అనేవారు. ఇలానే..శోభన్‌బాబు గురించి కూడా కథనాలు వచ్చేవి. అయితే.. శోభన్‌బాబు మందుజోలికి పోయేవారు కాదు. ఆయనకు సిగరెట్లు అలవాటు.
షూటింగ్ గ్యాపలో సిగరెట్లు కాల్చేవారు. అయితే.. అనూహ్యంగాఆయన కు బాపు -రమణల నుంచి ఆఫర్ వచ్చింది. అదే.. సంపూర్ణ రామాయణం సినిమా. ఇదొకట్రెండ్‌ను సెట్ చేసింది. మరి కుటుంబ కథల హీరోగా పేరున్న శోభన్‌బాబును అనూహ్యంగా రాముడిని చేశారు బాపు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అంతా ఓకే అయిపోయింది. అడ్వాన్సుగా రెండు లక్షలు కూడా ఇచ్చేశారు.
అయితే.. ఎందుకో.. శోభన్‌బాబుకు డౌట్ వచ్చింది. రాముడి వేషం కదా.. సిగరెట్లు తాగొచ్చోలేదో.. అని అనుకున్నారు. ఆయన సిగరెట్లు తాగకుండా..డైలాగులు చెప్పలేరనే టాక్ ఉంది. ఇదే విషయాన్ని ఆరుద్రను అడిగారు (ఈయన ఆ సినిమాకు రచయిత). అమ్మో నాకు తెలియదు.. అది వాల్మీకి(బాపు) తీస్తున్న సినిమా.. ఆయన్నే అడగమని తప్పుకొన్నారు.
దీంతో బాపు ను స్వయంగా అడిగేందుకు మొహమాటపడిన శోభన్‌బాబు.. పీఏను ఆయన దగ్గరకు పంపించారు. పీఏగా అప్పట్లో ప్రసాద్ అని ఉండేవారు. కృష్ణకు ఐదారుగురు పీఏలు ఉంటే.. ఖర్చు దండగని.. శోభన్‌బాబు ఒక్కరినే పెట్టుకున్నారు. ఇక, ప్రసాద్ బాపు దగ్గరకు వచ్చి.. చిత్రంగా అడిగారు. రాముడు సిగరెట్లు తాగొచ్చాండీ అని అడిగారు!
పక్కనే ఉన్న ముళ్లపూడి వెంకట రమణ (మాటల రచయిత).. వాల్మీకి(బాపు) కూడా తాగొచ్చు. కానీ, షూటింగు అంతా అయిపోయాకే!! అని అటు శోభన్‌బాబుకు, ఇటు బాపుకు కూడా కలిపి.. లెస్సన్ ఇచ్చారన్నమాట. అతి కష్టం మీద శోభన్‌బాబు ఈ సినిమా పూర్తి చేశారు. తొలి రెండు వారాలు మైనస్.. తర్వాత.. కోట్లకు కోట్లు రాబట్టింది.