మహాకవి శ్రీశ్రీ రచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు అభిమానులు మన దేశంలో కంటే కూడా రష్యా సహా కమ్యూనిస్టు దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ఒకసారి రష్యాకు వెళ్లిన శ్రీశ్రీకి అక్కడ నిబంధనలకు విరుద్ధమే అయినా.. పూల పాన్పు వేసి నడిపించారు. అంతేకాదు.. సైనిక గౌరవం అందుకున్న రష్యాయేతర వ్యక్తి పైగా.. రాజకీయేతర వ్యక్తిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే.. శ్రీశ్రీకి ఇంకా మంచి పేరు వచ్చిందని అంటారు. ఇక, అన్నగారికి శ్రీశ్రీ అంటే.. మహా ఇష్టం.
శ్రీశ్రీ సెట్‌కు వస్తున్నారు.. అని ఎవరైనా అంటే.. శ్రీశ్రీగారు అని పిలవాలని చెప్పేవారు. అంతేకాదు.. ఎన్టీఆర్ అయితే.. ఉద్యమం నడిచివస్తోందండీ మీరు వస్తుంటే.. అని చమత్కరించేవారు. శ్రీశ్రీకి అన్నగారికి అవినాభావ సంబంధం ఉంది. పలు సినిమాల్లో అన్నగారికి ఆయన మాటలు రాశారు. చాలా మంది శ్రీశ్రీ అంటే.. అభ్యుదయ వాదిగానే పరిమితం అవుతారు. కానీ, ఆయన సాంఘికమే కాదు.. పౌరాణిక సినిమాల్లో అన్నగారికి మాటలు రాసి హైలెట్ అయ్యారు. కీలకమైన అనేక డైలాగులు.. శ్రీశ్రీకలం నుంచి వచ్చినవంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఇక, విజయనగరం జిల్లాకే చెందిన గురజాడ అప్పారావు.. ఈయన కూడా మహాకవి. రాసిన కన్యాశుల్కం సినిమాను సినిమాను తీశారు. చిన్న చిన్నమార్పులు చేయాల్సి వచ్చింది. ఈ బాధ్యతను ఏకంగా.. శ్రీశ్రీకే ఇవ్వాలని పట్టుబట్టారు అన్నగారు. దీంతో ఆయనే బాధ్యత వహించారు. ఈ క్రమంలో ఆయన రాసుకున్న ఒక కవితను సినిమాలో పెట్టాలని శ్రీశ్రీ చెప్పారు. అదే.. `ఆనందం అర్ణవమైతే.. “ అనే కవిత. దీనిపై అందరూ పెదవి విరిచారు. అయితే.. అన్నగారి దాకా ఈ విషయం వెళ్లింది. ఆ కవితను వేరే వారి ద్వారా తెప్పించుకుని చదివారు.
భేష్! ఇది కవిత కాదు.. పాటగా కావాలి… నా మాటగా దర్శకుల వారికి చెప్పండి.. అని అన్నగారు వర్తమానం పంపారు. తెల్లారేసరికి దీనిలో మార్పులు చేయాలంటూ.. శ్రీశ్రీకి పంపారు. కానీ, ఆయన కుదరదన్నారు. మళ్లీ ఇది అన్నగారి వద్దకు వచ్చింది. మార్పులు కుదరదన్నారని చెప్పారు. అసలు మార్పులు ఎందుకు.. అలానే పాడించండి!
అని అన్నగారి ఆదేశం. అంతే.. మరుక్షణం ఈ కవితను పాటగా మార్చి లీలతో పాడించారు. ఈ సినిమాలో ఎన్నో పాటలు ఉన్నా.. ఇది కీర్తి కిరీటంగా నిలిచిపోయింది.