అన్నగారు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో అనేక సినిమాలు చేశారు. ఎన్నో పౌరాణిక సినిమాలకు ప్రాణం పోశారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే 24 క్రాఫ్ట్స్‌పై పట్టు పెంచుకున్న అన్నగారు.. తర్వాత కాలంలో దీనిని మరింతగా రాణించేలా చేశారు. అందుకే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు అనేక సినిమాల్లో అన్నగారు నటించారు. దర్శకత్వం కూడా వహించారు. ఇక, అన్నగారి సినిమాల్లో నటిం చేందుకు నటీనటులు క్యూ కట్టేవారు. ఆయనే మహానటుడు.. ఆయన దర్శకత్వం అంటే.. అంటూ.. చాలా మంది ఎగబడేవారు.
దీంతో అన్నగారు సినిమా గురించి ఏమాత్రం ఉప్పందినా.. ఆయనకోరకుండానే ఏదో ఒక పాత్ర చాలంటూ.. వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. అన్నగారు కూడా ఎవరినీ కాదనకుండా.. ఆయా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అయితే.. ఇక్కడఒక విషయం చెప్పాలి. అన్నగారి దర్శకత్వం అన్నా.. ఆయన నటనన్నా.. బాగానే ఉన్నా.. అన్నగారి డిసిప్లిన్ కూడా చర్చించాలి. టైం అంటే.. టైమే.. ఖచ్చితంగా సెట్‌లో ఉండాల్సిందే.
దీంతో నటీనటులు ఠంచనుగా ఆ సమయానికి వచ్చేవారు. ఇక, సెట్లోనే టిఫిన్లు.. టీలు.. ఇచ్చేవారు. కానీ, అన్నగారి సినిమా అంటే.. కేవలం కేవలం రెండు రకాల టిఫిన్లు మాత్రమే ఉండేవి. అది కూడా లెక్కపెట్టి తెప్పించేవారట. ఇడ్లీ.. వడ లేకపోతే.. ఇడ్లీ.. పొంగల్. అంతే! అంతేకాదు.. అన్నగారే స్వయంగా వడ్డించేవా రు. దీంతో మొహమాటానికి పోయే చాలా మంది నటీనటులుపెద్దగా తినేవారుకాదు. పోనీ.. బాగా తినాలని అనుకున్నవారు కూడా మళ్లీ అడిగితే.. అన్నగారు ఏమనుకుంటారో.. అని భయపడేవారు.
దీంతో ఇళ్ల నుంచే క్యారేజీలు తెప్పించుకునేవారట. ఇదే విషయాన్ని అన్నగారి సోదరుడు త్రివిక్రమరావు ఓ సందర్భంలో చెప్పారు. అయితే.. అన్నగారు మాత్రం దీనిని లైట్‌గా తీసుకున్నారట. బాగా తింటే నిద్రొస్తుందోయ్.. నటించలేరు.. సగంసగమే.. అంతా! అని చమత్కరించేవారట. అందుకే ఆయన డైరెక్షన్ అంటే ఇష్టపడేవారు.. వెంట క్యారేజీలను తీసుకువెళ్లేవారని అంటారు.