సినిమా నటులకు ఇప్పుడు వ్యాపారాలు.. వ్యవహారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే వార్తలు తరచుగా వింటున్నాం. అనేక మంది ఒకవైపు సినిమాల్లో నటిస్తూ.. బాగానే ఆర్జిస్తున్నారు. అదేసమయంలో మరోవైపు ఇతర వ్యాపారాల్లోనూ వారు బిజీగా ఉన్నారు. దీంతో చాలా మంది యువ హీరోయిన్లు.. హీరోలు కూడా.. ఆర్థికంగా బలంగానే ఉన్నారని చెప్పాలి. అయితే.. గతంలో నూ ఇలాంటి వారు చాలానే ఉన్నారు.
ముఖ్యంగా కమెడియన్లను తీసుకుంటే.. ఒకరిద్దరు మినహా.. ఎక్కువ మంది.. ఫ్యూచర్ కోసం పునాదులు బలంగానే వేసుకున్నారని అంటారు. ఇలాంటి వారిలో రమణారెడ్డి, నగేష్(తమిళియన్), పద్మనాభం, రేలంగి వంటివారు ముందు వరుసలో ఉన్నారు. రమణారెడ్డి స్వస్థలం నెల్లూరు. ఈయన అసలు పేరు పి.. వెంకట రమణారెడ్డి. పూర్వాశ్రమంలో ఆయన ఉపాధ్యాయుడు. అయితే.. నాటకాలపై పిచ్చితో ఆయన వేసి.. తులసీ దురంధర నాటకం వేసిన సమయంలో అగ్రదర్శకుడు.. ఎల్వీ ప్రసాద్ ఆయన నటనకు మెచ్చి.. చిన్న వేషం ఇచ్చారు.
తర్వాత పుంజుకున్నారు. అయితే.. సినిమా రంగంలోకి తన వారిని తీసుకురాలేదు. తర్వాత కాలంలో నెల్లూరులో సినిమా హాలు నిర్మించి.. తన వారికి ఇచ్చారు. అయితే.. తర్వాత.. దానిని స్కూల్‌గా మార్చారు. అలాగే నగేష్ తమిళంలోనూ తెలుగులోనూ హిట్టయ్యారు. ఆయన కూడా సినిమా హాళ్లు నిర్మించుకున్నారు. వీటిలో ఒకటి ఇప్పటికీ.. తిరువణ్ణామలైలో ఉంది.
అలానే.. పద్మనాభం.. కడపలో సినిమా హాల్ కట్టాలని అనుకుని స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. రేలంగి.. కూడా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సినిమా హాలు కట్టి.. కుమారుడికి ఇచ్చారు. ఇప్పటికీ ఉంది. తెనాలిలో అన్నగారు ఎన్టీఆర్ నిర్మించిన సినిమా హాలును నిర్మాత ఒకరు కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌లోనూ రామకృష్ణ, తారకరామా థియేటర్లు నిర్మించారు.