తన అభిమాన నటుడు హీరో కృష్ణ తో ఓ భారీ సినిమా తీయాలని, పరిశ్రమలో అంతవరకూ లేని బడ్జెట్‌తో ఆ చిత్రం తయారు కావాలనే కోరికతో నిర్మాత రామలింగేశ్వరరావు కంచుకాగడా తీశారు. ఎన్నాళ్లనుంచో ఉన్న ఊహలకు ఓ రూపం ఇచ్చి ఈ చిత్రకథ రాయించారు. ‘నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే ఆయనతో ఈ చిత్రం తీయించింది. ‘కలర్‌ఫుల్ కాస్ట్లీ ఫిల్మ్’గా ఆ రోజుల్లో ‘కంచుకాగడా’ పేరొందింది. భారీ తారాగణం, భారీ సెట్స్, భారీ సాంకేతిక విలువలు జోడించారు.
ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు రామలింగేశ్వరరావు. ఈ చిత్రానికి ముగ్గురు రచయితలు.. సత్యమూర్తి, మహారథి, సత్యానంద్ పనిచేశారు. ఈ చిత్రానికి స్ర్కీన్పరంగా కూడా దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హీరోయిన్గా శ్రీదేవిని ఎంపిక చేశారు. గ్లామర్ క్వీన్‌గా వెలుగొందుతున్న ఆమెకు చాలా కాలం తర్వాత తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రావడంతో ఈ చిత్రంలోని దుర్గ పాత్రను ఓ ఛాలెంజ్‌గా తీసుకొని నటించారు. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్లో పాల్గొని అందర్నీ ఆశ్యర్యపరిచారు.
ఒక పక్క ‘కంచుకాగడా’ షూటింగ్ జరుగుతుంటే మరో పక్క కృష్ణ, శోభన్‌బాబుల మల్టీస్టారర్ ‘మహాసంగ్రామం’ కూడా నిర్మాణంలో ఉండేది. రెండూ భారీ చిత్రాలే. దాంతో ఒకదాన్ని మించి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు, తిరుపతిరెడ్డి ఖర్చు విషయంలో పోటీ పడేవారు. ఈ రెండు చిత్రాలకూ కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం గమనార్హం.
ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా హీరో కృష్ణ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికి కృష్ణ చిత్రాలు ఆడనివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో కంచుకాగడా.. సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఖర్చులో కనీసం పాతిక వంతు కూడా రాలేదు. దీంతో కృష్ణ తన పారిషోతికాన్ని తిరిగి ఇచ్చేశారు.