అక్కినేని అఖిల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ డిజాస్టర్ అయింది. మూడేళ్ల పాటు ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేదు. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని హడావిడి చేసిన అక్కినేని ఫ్యాన్స్ మొహాలు వాడిపోయాయి. అయితే ఈ సినిమా రిజల్ట్‌తో ఇప్పుడు అక్కినేని అభిమానులే కాదు అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఖంగుతింది. సోషల్ మీడియాలో లబోదిబోమంటోంది.
ఏజెంట్ ప్లాప్ అవ్వడానికి బన్నీ ఫ్యాన్స్‌కు లింక్ ఏంటనుకుంటున్నారా ? ఏజెంట్ సినిమా ఇప్పుడు అల్లు ఆర్మీని తెగ టెన్షన్ పెట్టేస్తోంది. గతంలో బన్నీ – సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో రేసుగుర్రం సినిమా వచ్చింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే బన్నీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ కావడానికి రేసుగుర్రం కీలకం.
దీంతో ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి – బన్నీ కాంబినేషన్ అంటూ కొత్త ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తోంది. మరోసారి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందటూ ఒక్కటే హడావిడి నడుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్‌పై ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. ఇప్పుడు ఏజెంట్ సినిమాకు వచ్చిన టాక్ చూసి బాబోయ్ మాకు మరో ఏజెంట్ 2 సినిమా వద్దే వద్దు అని దండాలు పెట్టేస్తున్నారు.
చిరు – చరణ్ కలిసి చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా బన్నీ-కొరటాల కాంబోపై ఇలాంటి ప్రచారమే జరిగింది. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా తర్వాత బన్నీ లిస్టులో త్రివిక్రమ్ – వేణు శ్రీరామ్ – సందీప్ రెడ్డి వంగ పేర్లు ఉన్నాయి. వీళ్లల్లో ఎవరిని అయినా ఓకే కాని… సురేందర్‌రెడ్డిని మాత్రం దగ్గరకు రానివ్వొద్దంటూ బన్నీ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.