కొంత మంది హీరోయిన్ల విషయంలో బయట ప్రచారంలో ఉన్నది ఒకటైతే.. వాస్తవం మాత్రం మరొకటి. అంటే.. వారు తెలుగు వారుకానప్పటికీ.. తెలుగు వారిలా ప్రచారంలో ఉండడం, వారు తొలి అరంగేట్రం ఒక దర్శకుడి ద్వారా అయితే.. మరో దర్శకుడు వారిని సినిమాలకు పరిచయం చేశారనే పేరు రావడం గమనార్హం. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఉదాహరణకు.. మరో చరిత్ర హీరోయిన్ సరితకు మంచి పేరు వచ్చింది.
కమల్ హాసన్‌తో ఆమె నటించిన సినిమా.. ఇదే కావడం.. దీనికి భారీ ఎత్తున పేరురావడం తెలిసిందే. అయితే.. సరితను తమిళియన్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆమె తెలుగు నటీమణి. సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి దగ్గర వయోలిన్ ప్లేయర్‌గా పనిచేశారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తర్వాత.. ఆమెను చూసిన బాలచందర్.. సినిమాలో నటిస్తావా.. అని అడగడం.. తర్వాత.. ఆమె నటించడం జరిగాయి.
ఇక, మాధవి. ఖైదీలో చిరు పక్కన విజృంభించిన మాధవి.. విషయంలోనూఅనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె తమిళియన్ అని.. తొలి చిత్రం తమిళంతో పరిచయం అయ్యారని అంటారు. కానీ, ఆమె వాస్తవానికి.. తెలుగు నటీమణి. అనంతపురం జిల్లాకు చెందిన మాధవిని దర్శకుడు దాసరి నారాయణరా వు.. తూర్పు పడమర సినిమాలో పరిచయం చేశారు. అయితే.. తర్వాత తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇలా.. తమిళియన్‌గా ప్రచారం పొందారు.
ఇక, తెలుగు సినిమాల్లో తనకంటూ.. ప్రత్యేకతను చాటుకున్న నిర్మలమ్మ, జయంతి వంటి క్యారెక్టర్ నటులు.. తెలుగు వారని అనుకుంటారు. కానీ, వారు తమిళియన్స్. కానీ.. కుటుంబాలు తరలి వచ్చి.. మద్రాస్ ప్రెసిడెన్సీలో నెల్లూరులో స్థిరపడడంతో వారు తెలుగు వారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, జయప్రద ఏ రాష్ట్రానికి చెందిన వారు అంటే.. కొన్ని సందేహాలు ఉన్నాయికానీ ఆమెది రాజమండ్రి. కానీ, ఉత్తరప్రదేశ్ వాళ్లు తమ రాష్ట్రానికి చెందిన నటీమణి అని భావిస్తారు. ఇలా.. అనేక విషయాల్లో బయట జరుగుతున్న ప్రచారం వేరు.. వాస్తవం వేరు కావడం గమనార్హం.