Moviesగోపీచంద్ ‘రామబాణం’ రివ్యూ : బాణం అని చెప్పి గునపం దించారుగా..!!

గోపీచంద్ ‘రామబాణం’ రివ్యూ : బాణం అని చెప్పి గునపం దించారుగా..!!

మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నా.. అనుకున్న సక్సెస్ మాత్రం దక్కడం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలతో గోపీచంద్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే, ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథగా ‘రామబాణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ రామబాణం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రామబాణం గోపీచంద్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
విక్కీ(గోపీచంద్) చాలా కాలం తరువాత తన అన్నయ్య రాజారాం(జగపతి బాబు) వద్దకు వస్తాడు. తన అన్నయ్య కొన్ని ఇబ్బందుల్లో ఉండటం చూసి వాటిని పరిష్కరిస్తాడు. అయితే కొందరు ప్రత్యర్థుల వల్ల తన అన్న ప్రాణానికి హాని ఉందని తెలుసుకుంటాడు విక్కీ. వారిని విక్కీ ఎలా ఎదుర్కొంటాడు.. అసలు విక్కీ ఎవరు.. అతడి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి.. అనేది సినిమా కథ.

విశ్లేషణ:
హీరో గోపీచంద్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అతడి కథ ఎంపికలో ఏమాత్రం పర్ఫెక్షన్ లేదని మరోసారి రామబాణం మూవీ నిరూపించింది. దర్శకుడు శ్రీవాస్ ఎప్పటిలాగే రొట్ట కొట్టుడు కథకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పేరు పెట్టి ప్రేక్షకుల మీదకు రామబాణం అంటూ ఈ సినిమాను వదిలాడు. ఈ సినిమాతో ఈ ఇద్దరు కూడా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకోనున్నారు.

రామబాణం కథనం విషయానికి వస్తే.. ఇంట్లో నుండి పారిపోయిన తమ్ముడు, తిరిగి తన అన్న వద్దకు రావడం.. అక్కడ అన్నకు ఎదురయ్యే సమస్యలను తమ్ముడు పరిష్కరించడం మనకు పాతకాలం సినిమాల నుండి కనిపిస్తూ వస్తోంది. మరోసారి అదే కథను తీసి ప్రేక్షకులపై వదిలాడు గోపీచంద్. కథలో ఎక్కడా ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రొటీన్ కథతో సినిమా స్టార్ట్ కావడంతో ప్రేక్షకులు ఇంటర్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇంటర్వెల్ కార్డు పడగానే, బయటకు వచ్చి వేడి టీ తాగి తలనొప్పిని తగ్గించుకోవాలని చూస్తారు.

ఇక సెకండాఫ్‌లోనైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ అంశాన్ని చూపిస్తారేమో అని లోపలికి వెళ్లిన ఆడియెన్స్.. ఇంటర్వెల్‌లోనే బయటకు ఎందుకు వెళ్లిపోలేదా అని బాధపడతారు. సెకండాఫ్‌లోనూ రొటీన్ కథ, ఎమోషన్ అని చెప్పి విసిగించే సీన్స్, ఒకటే మ్యూజిక్ ఇచ్చే యాక్షన్ సీన్స్.. అమ్మబాబోయ్.. ప్రేక్షకుల సహనాన్ని టెస్ట్ చేసేందుకే ఈ సినిమాను తీసారా అనిపించేలా ఉంటుంది. ఎట్టకేలకు క్లైమాక్స్ రాగానే, శుభం కార్డు కూడా చూడకుండా చాలా మంది ఆడియెన్స్ థియేటర్స్ నుండి వెళ్లిపోయారు. అంతలా రామబాణం సినిమా ప్రేక్షకులను విసిగిస్తుంది. కేవలం కామెడీ సీన్స్ వరకే ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్:
గోపీచంద్ మరోసారి రొటీన్ బాదుడు బాది ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. సినిమాలో తన పాత్ర వరకు ఓకే అనిపించినా, అదే తరహా యాక్షన్ చూసి ప్రేక్షకులు విసిగిపోతారు. డింపుల్ హయతి పర్వాలేదనిపించింది. జగపతి బాబు పాత్ర కొంతమేర బాగుంది. అలీ, వెన్నెల కిషోర్ తమ కామెడీతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శ్రీవాస్ ఓ ఎంగేజింగ్ కథను ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రొటీన్ కథ అయినా, దాన్ని వైవిధ్యంగా ప్రెజెంట్ చేసే చక్కటి అవకాశాన్ని పూర్తిగా వేస్ట్ చేశాడు. సినిమాను ఎక్కడా కూడా ప్రేక్షకుడికి నచ్చే విధంగా మలచలేకపోయాడు. సినిమాటోగ్రఫీ కొంతమేర ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. బీజీఎం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు భారీగా ఉండటంతో ఈ సినిమా చాలా రిచ్‌గ కనిపిస్తుంది. ఈ సినిమాకు ఎడిటింగ్ వర్క్ చాలా అవసరం.

చివరగా:
రామబాణం – బాణం అని చెప్పి గునపం దించారుగా!

రేటింగ్:
2.0/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news