స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందే రోజుల నుంచి తనతో కలసి ఉన్న స్నేహితులు సుధాకర్, హరిప్రసాద్. అయితే..తనకు ఆఫర్లు వస్తున్నాయి కానీ.. వీరికి రావడం లేదు. దీంతో ఎంతోమందికి చెప్పి చూశారట. కానీ, చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి. దీంతో ఇలా కాదు.. తనే ఒక నిర్ణయం తీసుకోవాలని భావించి.. వారి కోసం ఆయన ఓ సినిమా చేసి స్నేహం గొప్పతనాన్ని చాటారు.
ఆ సినిమానే ‘యముడికి మొగుడు’. తనతో ఇంతకుముందు ‘దేవాంతకుడు’ చిత్రాన్ని నిర్మించిన నటుడు నారాయణరావు కూడా ఈ చిత్ర నిర్మాణంలో సహనిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో సుధాకర్, హరిప్రసా ద్‌కు చక్కటి రోల్స్ ఇచ్చారు. తర్వాత.. వారికి మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. చిరంజీవి ద్విపాత్రాభిన యంతో రూపుదిద్దుకొన్న ‘యముడికి మొగుడు’ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
కైకాల సత్యనారాయణ యముడిగా నటించారు. ‘హెవెన్ కెన్ వెయిట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించారు. సినిమా సూపర్ హిట్ అయింది.చిరంజీవి డైలాగులకు యువత రెచ్చిపోయారు. చాలా కేంద్రాల్లో 100 రోజులు ఈ సినిమా ఆడింది. దీంతో ‘యముడికి మొగుడు’ చిత్రం శత దినోత్సవం చేశారు. అయితే. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
దీంతో శతదినోత్సవం నాడే. చిరంజీవి ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన పత్తి రైతుల కుటుంబ సభ్యుల ను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించారు. ఇలా తన మానవత్వం చాటుకున్నారు. అప్పుడే కాదు.. గుప్త దానాలు చేయడంలోనూ చిరంజీవి ముందున్నారు.