బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నటీమణి.. జమున ఆమెకు నిజానికి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు. అయినా.. కూడా ఆమె ఏనాడూ.. అవార్డుల కోసం ఎదురు చూడలేదు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన జమున జననం.. బెంగళూరులో జరిగింది. తర్వాత.. కుటుంబం దుగ్గిరాలకు వచ్చేసింది. జమున తండ్రి పసుపు వ్యాపారం చేయడంతో పాటు దుగ్గిరాల సమీపంలో పసుపు గోడౌన్లు నిర్వహించేవారు.
అందుకే జమునకు దుగ్గిరాల, మంగళగిరి, గుంటూరుతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఎక్కువ. అయితే.. అసలు ఏమాత్రం సినీ ప్రపంచంతో సంబంధం లేని కుటుంబం. అంతేకాదు.. అసలు సినిమాల జోలికి కూడా వెళ్లే కుటుంబం కానేకాదు. అయినా.. కూడా జమున సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. దీనికి ప్రధానంగా.. సావిత్రి సహవాసమేనని అంటారు జమున.
అసలు సినిమా ఇండస్ట్రీకి పరిచయం ఏర్పడడమే సావిత్రితో అంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పట్లో ఒక సినిమా షూటింగ్ దుగ్గిరాలలో జరుగుతోంది. తోడికోడళ్లు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి.. హీరో హీరోయిన్లు. ఎక్కడో గుంటూరులో ఉన్న హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. కానీ.. షూటింగ్ సమయంలో సావిత్రికి జ్వరం వచ్చింది. దీంతో పొరుగున ఉన్న జమున కుటుంబమే సావిత్రికి ఆశ్రయం ఇచ్చింది.
ఇలా.. రెండు రోజులు సావిత్రి అక్కడే ఉన్నారు. ఈ పరిచయంతోనే తర్వాత.. ఏడాది సావిత్రి నుంచి జమునకు ఉత్తరం వచ్చింది. రా చెల్లీ.. మా ఇంట్లో ఉందువు గాని
అని! దీంతో జమున వెళ్లడం.. అక్కడే ఉన్నారు. ఆదుర్తి సుబ్బారావు తీసిన ఒక సినిమాలో చిన్న అవకాశం రాగానే సావిత్ర ఎంకరేజ్ చేయడంతో అలా అలా సినిమాల్లో ప్రవేశించారు.
సావిత్రిని తన గైడర్‌గా చెప్పుకొనే జమున.. ఆమె చూపించిన బాటలోనే నడిచారు. సావిత్రి మరణించినప్పుడు.. పక్కనే ఉన్నారట. ఆమెకు ఎంతో చేయాలని ఉన్నా.. చేయలేక పోయానని.. తుది వరకు తపించారు జమున.