దివంగత మహానటి సావిత్రి కెరీర్ పెద్ద సంచలనం. ఆమే కెరీర్లో ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగిందో ఆమె చేసిన చిన్న తప్పుతో అంతే స్పీడ్‌గా పతనం అయిపోయింది. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని.. రెండు , మూడు ఎఫైర్లు కూడా ఉన్న జెమినీ గణేశన్‌ను సావిత్రి పెళ్లి చేసుకుంది. సావిత్రిని పెళ్లి చేసుకునేందుకు ఎందరో రాకుమారుల్లాంటి అబ్బాయిలు రెడీగా ఉన్నా కూడా ఆమె పోయి పోయి జెమినీ జీవితంలోకి మూడో భార్యగా వెళ్లింది.
అదే ఆమె కెరీర్ నాశనం చేసుకునే క్రమంలో వేసిన తొలి తప్పు. అయితే సావిత్రి జెమినీని పెళ్లి చేసుకోవడం సావిత్రి ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు. చాలా కోప్పడ్డారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ వ్యసనపరుడికి మూడో భార్యగా వెళతావా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా సావిత్రి వాళ్ల మాటలు వినలేదు. జెమినీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది.
అయితే ఆ విషయం చాన్నాళ్ల పాటు ఎవ్వరికి తెలియలేదు. ఇద్దరూ సీక్రెట్‌గానే కాపురం చేసేవారు. ఎవరి ఇంట్లో వారు ఉన్నా.. ఓ అద్దె ఇళ్లు తీసుకుని అక్కడ కలుసుకునేవారు. అయితే లక్స్ సబ్ యాడ్ కోసం సావిత్రి అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. ఆ సంతకంలో ఆమె పొరపాటుగా సావిత్రి జెమినీ గణేషన్ అని రాసేసింది. దాంతో ఆమె జెమినీని పెళ్లి చేసుకున్న విషయం బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత సావిత్రి నాలిక్కరచుకున్నా అప్పటికే మీడియా ద్వారా ఆ విషయం వైరల్ అయిపోయింది. సావిత్రి ఇంట్లో వాళ్లు అరిచి గీపెట్టినా కూడా సావిత్రి జెమినీతో కాపురం మొదలు పెట్టేసింది. ఆ తర్వాత బిడ్డలకు జన్మనివ్వడం.. జెమినీతో విబేధాలు.. చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు బానిసై ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.