MoviesTL రివ్యూ: రావ‌ణాసుర‌.. ర‌వితేజ హిట్టు… సినిమా ఫ‌ట్‌

TL రివ్యూ: రావ‌ణాసుర‌.. ర‌వితేజ హిట్టు… సినిమా ఫ‌ట్‌

న‌టీన‌టులు : ర‌వితేజ‌, సుశాంత్‌, అనూ ఎమ్మాన్యుయేల్‌, ఫ‌రియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌, ద‌క్కా న‌గార్క‌ర్‌
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఆర్టీ టీమ్ వ‌ర్క్స్‌
స్టోరీ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సినిమాటోగ్ర‌ఫీ: వ‌ఇజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలీ
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, భీమ్స్‌
నిర్మాత‌: అభిషేక్ నామా, ర‌వితేజ‌
స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్‌: సుధీర్ వ‌ర్మ‌
సెన్సార్ రిపోర్ట్‌: ఏ
ర‌న్ టైం : 139 నిమిషాలు
రిలీజ్ డేట్: 7 ఏప్రిల్‌, 2023
ప్రి రిలీజ్ బిజినెస్ ( వ‌ర‌ల్డ్ వైడ్‌): 22.20 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ – 23 కోట్లు

రావ‌ణాసుర ప‌రిచ‌యం :
మాస్ మహారాజ్ రవితేజ చాలా రోజుల త‌ర్వాత వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. గ‌తేడాది డిసెంబ‌ర్లో ధ‌మాకా లాంటి కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ వాల్తేరు వీర‌య్య సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోయింది. వీర‌య్య సినిమా ఎంత చిరు సినిమా అయినా.. ర‌వితేజ వ‌ల్లే ఈ సినిమా రేంజ్ పెరిగింద‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే ర‌వితేజ చాలా త‌క్కువ టైంలోనే మ‌రోసారి రావణాసుర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే ఇదో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని క్లారిటీ వ‌చ్చేసింది. సుధీర్‌వ‌ర్మ లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌వితేజ‌కు జోడీగా ఏకంగా ఐదుగురు హీరోయిన్లు న‌టించారు. మ‌రి ఈ రావ‌ణాసురుడు బాక్సాఫీస్ వార్‌లో విజ‌యం సాధించాడా ? లేదా ? అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

రావ‌ణాసుర క‌థ‌ :
ర‌వితేజ ఓ జూనియర్ లాయర్, సీనియర్ లాయర్ ఫరియా అబ్దుల్లాతో కలిసి త‌న ప‌ని తాను చేసుకు పోతుంటాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో హీరోయిన్ మేఘా ఆకాష్ ఓ హత్య కేసును టేకప్ చేయమని వాళ్ల‌ను రిక్వెస్ట్ చేస్తుంది. మేఘ తండ్రి సంప‌త్‌రాజ్ పై ఓ మ‌ర్డ‌ర్ కేసు ఉంటుంది. అయితే అత‌డు మాత్రం ఈ కేసుకు నాకు సంబంధం లేదు.. ఎవ‌రో కావాల‌నే త‌న‌ను ఇరికించార‌ని చెపుతుంటాడు. ఈ నేప‌థ్యంలోనే అదే త‌ర‌హా మ‌ర్డ‌ర్లు వ‌రుస‌గా జ‌రుగుతూ ఉంటాయి. ఈ సీరియ‌ల్ హ‌త్యల వెన‌క ర‌వితేజ ఉన్నాడ‌నే విష‌యం ఓ షాకింగ్ ట్విస్ట్‌తో తెలుస్తుంది. అత‌డు అంత క్రూరంగా మార‌డానికి కార‌ణం ఏంటి ? అస‌లు ఈ సినిమాలో మ‌లుపులు ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరి.

విశ్లేష‌ణ :
రవితేజ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. హీరోయిన్‌, త‌న సీనియ‌ర్ లాయ‌ర్ ఫరియా అబ్దుల్లాతో అతడి కామెడీ సీన్లు బాగున్నాయి. మ‌నం సినిమా అంత‌టా ర‌వితేజ పాత్ర‌తో ట్రావెల్ అవుతుంటాము. ర‌వితేజ‌ను నెగెటివ్ షేడ్‌లో చూడటం చాలా థ్రిల్‌గా ఉంటుంది. ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో ఓ ఓ ఇంట్ర‌స్టింగ్ రోల్‌ చేసాడు. అయితే అత‌డి పాత్ర చుట్టూ క్రియేట్ చేయబడిన హైప్‌తో పోలిస్తే పాత్ర తేలిపోయిన‌ట్టే ఉంది. సంపత్ రాజ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, శ్రీరామ్, జయరామ్, దక్షనాగార్కర్, రావు రమేష్ వంటి ప్రతి ఇతర పాత్రలందరూ కథకు తగ్గట్టుగానే న‌టించారు.

దర్శకుడు సుధీర్ వర్మ తనకు అందించిన కథతో త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఫ‌స్టాఫ్ త‌న‌కు అల‌వాటైన రీతిలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌థ న‌డిపాడు. అయితే ఎన్నో అంచ‌నాలు ఉన్న సెకండాఫ్ మాత్రం డిజ‌ప్పాయింట్ చేసిన‌ట్లు ఉంది. సెకండాఫ్‌లో చాలా సీన్లు ముందుగానే ఊహించేలా ఉన్నాయి. ఇక స్క్రీన్ ప్లే కూడా ఆస‌క్తిగా లేదు. సెకండాఫ్‌లో ర‌వితేజ ఏం చేసినా వాటిని జ‌స్టిఫై చేసేందుకే కొన్ని సీన్లు రాసుకున్న‌ట్టు, అతికించిన‌ట్టుగా ఉంది.

సెకండాఫ్‌లో చాలా సీన్లు బ‌ల‌వంతంగా అతికించిన‌ట్టుగా ఉన్నాయి. ఇవ‌న్నీ సినిమాకు మైన‌స్ అయ్యాయి. కొన్ని మ‌ర్డ‌ర్ సీన్లు అయితే మరీ భ‌యంక‌రంగా అనిపిస్తాయి. ఇక మ‌ర్డ‌ర్ సీన్ల‌తో పాటు క్రైం సీన్ల ఎలివేష‌న్‌, యాక్ష‌న్ సీన్ల‌ను ఎలివేట్ చేయ‌డంలో బీజీఎం బాగా ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్‌లో ఇది ఒక‌టి. ఇక సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్‌గా ఉంది. విజువ‌ల్స్ అదిరిపోయాయి. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఉన్నంత‌లో బాగానే ట్రిమ్ చేశారు. పాట‌లు సినిమాకు మైన‌స్‌.

సినిమాలో ర‌వితేజ పాత్ర‌తో పాటు యాక్ష‌న్ సీన్లు, ఫ‌స్టాఫ్‌తో పాటు ట్విస్టులు, నేప‌థ్య సంగీతం ఫ్ల‌స్ పాయింట్స్‌గా ఉంటే… పూర్ స్క్రీన్ ప్లే, స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డం… సెకండాఫ్ మైన‌స్ అయ్యాయి.

ఫైన‌ల్‌గా…
రావణాసురు ఒక అద్భుతమైన సైకోటిక్ థ్రిల్లర్‌. ర‌వితేజ‌ను కామెడీ యాంగిల్లో చూసిన వారంద‌రూ ఇలాంటి యాక్ష‌న్ సినిమాలో ఎంత వ‌ర‌కు చూస్తార‌న్న‌ది ఓ డౌట్‌. ఇక సినిమా కూడా ర‌వితేజ వ‌రుస హిట్ల‌తో వ‌చ్చిన హైప్‌కు చాలా దూరంలో ఆగిపోయింది. ర‌వితేజ వీరాభిమానుల‌కు, మాస్ ప్రేక్ష‌కుల‌కు మాత్రం న‌చ్చుతుంది.

రావ‌ణాసుర TL రేటింగ్ : 2.5 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news