వంశీ, బాపు, కే. విశ్వనాథ్ ముగ్గురూ.. కూడా తెలుగు సినిమా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారనే చెప్పాలి. అమలిన శృంగారంతో ఆద్యంతం రక్తి కట్టించిన.. లేడీస్ టైలర్ వంటి సినిమాను అందించిన వంశీ.. అప్పట్లో రికార్డులపై రికార్డులు సృష్టించారు. ఏం సినిమా.. ఏం సినిమా.. అంటూనే.. విమర్శకులు సైతం.. రెండేసి మూడేసి సార్లు చూశారు. తర్వాత.. వచ్చిన సినిమాలు కూడా చక్కని కుటుంబ కథా చిత్రాలే కావడం గమనార్హం.
ఇక, బాపు.. గురించి చెప్పేదేముంది. ఆయన చిత్రాలు.. చిత్రాలే
!! ముందుగానే సన్నివేశాలను ఒక చిత్రం రూపంలో గీసుకుని.. దానికి తగిన విధంగా.. సినిమాలు తీసిన మహా దర్శకులు బాపు. ఇక, కే. విశ్వనాథ్, కళా తపస్వి. ఆయన తీసిన సినిమాలు.. సినిమాలు కావు.. కళా ఖండాలు… అన్నారు వేటూరి సుందర రామమూ ర్తి. సినిమాను సినిమాగా తీయడం అందరూ చేస్తారు. కానీ, సినిమాను ఉఛ్వాస నిశ్వాసాలుగా భావించిన యశస్వి.. కళాతపస్వి.
అయితే.. ఈ ముగ్గురిలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ముగ్గురూ కూడా.. లో బడ్జెట్ సినిమాలే తీస్తారు. ఎవరూ ఎక్కడా.. తప్పటడుగు కూడా వేయలేదు. అంతేకాదు.. నిర్మాత కష్టాలను ఆమూలాగ్రం ఔపోసన పెట్టిన దర్శకులు. సినిమాను.. తపించి.. జపించిన వారు. వీరికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే.. గోదావరి నదితో అనుబంధం. వంశీ.. బాపు.. విశ్వనాథ్‌లకు.. కామన్‌గా గోదావరి నది అంటే.. అమితమైన ప్రేమ.
వీరు తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ గోదావరి చిత్రీకరణలు ఉంటాయి. ఎక్కడా లేదు.. అనే మాట ఉండదు. సినిమాలో భాగంగా ఉన్న వే కాకుండా.. ఒక్కొక్కసారి భాగం కాకపోయినా.. ఎక్కడో ఒక పాటలో అయినా.. చొప్పించి. గోదావరి అందాలను ప్రేక్షకుల కళ్లకు కట్టారు. ప్రతి సినిమాలోనూ.. ఈ ప్రయోగం ఉంటుంది. అందుకే.. వీరి అభిరుచికి తగినట్టుగానే.. వీరి సినిమాలు కూడా గోదావరిలా ప్రజల హృదయాలను దోచుకున్నాయి.