టాలీవుడ్ లోనే మూల స్తంభం లాంటి కుటుంబంలో ఒకటి అయినా దగ్గుబాటి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. సీనియర్ హీరో వెంకటేష్ బాబాయ్ మూవీ మొగల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు (73) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన స్వగృహంలో మృతి చెందారు. బాబాయ్ మృతి చెందారన్న విషయం తెలుసుకున్న నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ తో కలిసి కారంచేడు వెళ్లి బాబాయి మృతదేహానికి నివాళులు అర్పించారు.
హీరో వెంకటేష్ తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండడంతో ఆయన కారంచేడు రాలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే వెంకటేష్ బుధవారం ఉదయం కారంచేడు వచ్చి తన బాబాయ్ మృతదేహానికి నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబు మృతి పట్ల సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేష్ మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామానాయుడు, మోహన్ బాబు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రామానాయుడు కెరీర్ ప్రారంభంలో చెన్నైలో సినిమా రంగంలో బిజీగా ఉంటే మోహన్ బాబు మాత్రం కారంచేడులో దగ్గుబాటి కుటుంబానికి ఉన్న వ్యవసాయం, ఇతర బాధ్యతలను చూసుకునేవారు. ఇక కారంచేచెడులోనే మోహన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.