అన్నగారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అచ్చతెలుగుకు ఆయన ప్రాణం పోసేవారు. ఆయన నటించిన సినిమాలు చూస్తే..తెలుగుకు ఎంత పట్టాభిషేకం చేశారో మనకు తెలుస్తుంది. ఇక, ఆయనే స్వయంగా దర్శకత్వం చేశారంటే.. తెలుగుకు పెద్దపీట వేయాల్సిందే. ఇలా వచ్చినవే.. శ్రీకృష్ణ పాండవీయం.. దానవీర శూరకర్ణ వంటి సినిమాలు. వీటిలో ఎక్కువగా ఎక్కడా కూడా సంస్కృత సమాసాలు మనకు కనిపించవు.
అలాగని డైలాగులు పేలవంగా కూడా ఉండవు. తరతరాలు చెప్పుకొనే డైలాగులు.. ఇప్పటికీ వినిపించే డైలాగులు పాంచాలి పంచ భర్తృక అనే డైలాగులు మనకు వినిపిస్తుంటాయి. ఇవి అచ్చ తెలుగు పదాలే. అయితే.. ఈ విషయంలో రచయితపై ఎక్కువ భారం మోపేవారు అన్నగారు. నిజానికి పౌరాణిక సినిమాలు అంటేనే.. ఎక్కడో ఒక చోట సంస్కృత సమాసాలకు ప్రాధాన్యం ఉంటుంది.
కానీ, అన్నగారు ఒప్పుకొనేవారు. దీంతో రచయితలకు పెద్ద పరీక్షే. మలితరంలో కి వచ్చేసరికి.. డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రచయితగా వచ్చారు. ఈయనకు అన్నగారు అనేక అవకావాలు కల్పించారు. గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే.. పాటతో సి. నారాయణరెడ్డి ఎంట్రీ ప్రారంభమైంది. తర్వాత.. అన్నగారు తీసిన ప్రతి సినిమాలోనూ నారాయణరెడ్డి పాత్ర ఎంతో ఉంది.
దాన వీర శూరకర్ణ డైలాగులు ఎక్కువగా తిరుపతి వెంకటకవులతో రాయించగా.. పాటలన్నీ నారాయణ రెడ్డి గారితో రాయించారు. డైలాగులు కూడా తెలుగులోనే సాగుతాయి. ఇక, పాటల విషయానికి వస్తే.. చిత్రం-భలారే విచిత్రం.. అనే పాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ పాట అన్నగారికి నచ్చడానికి సమయం పట్టింది. ఈ పాట రాసేందుకు మూడు నెలలపాటు సమయం తీసుకున్నట్టు నారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో అన్నగారు తనను ఇంత ఇబ్బంది ఎప్పుడూ పెట్టలేదని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పాట ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే.