విశ్వవిఖ్యాత నట స్వరూభౌమ ఎన్టీఆర్ సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయానికి ఆయనే సౌత్ ఇండియాలో తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అలాంటి వైభవాన్ని వదులుకొని ఆయన ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల శంఖారావం సభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు. బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించడంతో రజనీకాంత్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు వచ్చారు. అక్కడ బాలయ్య ఆయనకు స్వాగతం పలికి మరి సభా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సభికులతో పంచుకున్నారు. అప్పట్లోనే ఎన్టీఆర్ రేంజ్ ఎలా ? ఉండేది అన్న విషయాన్ని ఆయన చెప్పారు.
తన జీవితంలో ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని చెప్పిన రజనీకాంత్.. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్టు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చేనాటికే ఎన్టీఆర్ పారితోషకం సినిమాకు పది లక్షలకు పైనే ఉండేదని తెలిపారు. 42 – 43 సంవత్సరాల క్రితం ఒక్కో సినిమాకు పది లక్షలు అంటే ఇప్పటి లెక్కల్లో పోల్చి చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని.. అవన్నీ వదిలేసి కూడా ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు.. తెలుగు ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రమంతా తిరిగారు అని చెప్పారు.
తెలుగువారు పాలించాలా ? ఢిల్లీ పాలించాలా అని ఒకే ఒక్క ప్రశ్న వేశారు.. ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన 9 నెలలోనే సంచలనం క్రియేట్ చేశారు.. ఫుట్‌ఫాత్‌ల మీద నిద్రపోయారు. ఆయన యుగపురుషుడు.. ఆయన గురించి ఎంతైనా ? మాట్లాడుతూ ఉండొచ్చు అంటూ రజని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.
తన జీవితంలో తాను తనకు తెలియకుండానే రెండుసార్లు ఎగిరి గంతు వేశానని.. అందులో మొదటిసారి 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు.. రెండోసారి హిమాలయాలకు వెళ్లి గంగానది చూసినప్పుడు అని తెలిపారు. అప్పటివరకు సినిమాల్లోనే ఎన్టీఆర్ చూసిన తాను తొలిసారి 1963 లో నిజంగానే చూసానని చెప్పారు.