ఎస్. వరలక్ష్మి.. చాలా మంది నేటి తరాని యువతకు తెలియని ఒకప్పటి మేటి నటి. తల్లి పాత్రల్లోనూ.. అత్త పాత్రల్లోనూ ఆమె దంచి కొట్టారు. బాలకృష్ణతో నటించిన ఓ సినిమాలో అత్త పాత్రలో నటించి.. వెండితెరపై సూర్యాకాంతాన్ని మరిపించారు. అయితే.. వాస్తవానికి వరలక్ష్మి కెరీర్.. చాలా గంభీరంగా ప్రారంభమైంది. అంటే.. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెలో ఉన్న కళలు అనేకం.
వరలక్ష్మి గాయకురాలు.. నర్తకీమణి.. అంతేకాదు.. ప్రముఖ చిత్రలేఖకురాలు కూడా.. ఒకసారి ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు దక్షిణాది చిత్రాల ప్రముఖులు.. మహానటి సావిత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తే.. వారితో కలిసి వరలక్ష్మి కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే తాను ఇందిరమ్మ మాట్లాడుతుంటే.. ఎలా ఉంటుందో చిత్రంగా గీసి ఆమెకు బహూకరించారు. అంత ప్రత్యేకత ఉన్న నటీమణి. బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో హీరోయిన్‌గా నటించారు.
అయితే.. తర్వాత తర్వాత.. వెనుకబడిపోయారు. ముఖ్యంగా సావిత్రి, భానుమతి, అంజలీదేవి, జమున వంటి వారి దూకుడు ప్రారంభమయ్యాక కనుమరుగైన శ్రీరంజని, వై. విజయ వంటి అనేక మందిలో ఈమె కూడా ఉన్నారు. ఇక, ఈ విషయంలో తానెప్పుడూ చింతించలేదని వరలక్ష్మి చెబుతారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేశానన్నారు. మొత్తానికి చాలా మంచి నటీమణిగానే కాకుండా.. బహుముఖ ప్రజ్ఞావంతురాలుగా వరలక్ష్మి పేరు తెచ్చుకున్నారు.