టాలీవుడ్‌లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాగే వీరిద్దరి మధ్య కొన్ని విషయాలు పంతాలు, పట్టింపులు కొంత గ్యాప్‌నకు దారితీశాయి. అసలు వీరిద్దరి మధ్య ఫస్ట్ టైం ఓ సినిమా చిచ్చు పెట్టింది. అదే శ్రీకృష్ణార్జున యుద్ధం. మాయాబజార్ సినిమా తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన సినిమా ఇదే. ఈ సినిమా దర్శకుడు కెవి. రెడ్డి ప్రతిభకు అద్దం పడుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బావ, బావమరుదులుగా నటించారు.
సినిమాకు రచయిత పింగళి, సంగీత దర్శకుడు పెండ్యాల మ్యూజిక్ ఎంతో హైలెట్. 60 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన శ్రీకృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విజయా సంస్థ బ్యానర్లో 1961లో వచ్చిన జగదేకవీరుని కథ సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను కలిపి పౌరాణిక సినిమా చేయాలనుకున్నప్పుడు ఏ లైన్ తీసుకోవాలో దర్శకుడికి ముందు అర్థం కాలేదు.
దీంతో కెవి. రెడ్డి గయోపాఖ్యానం, పారిజాతాపహరణం, సుభద్రా కళ్యాణం పాయింట్లు కలిపి కథ అల్లుకున్నారు. శ్రీకృష్ణుడిగా అక్కినేని, అర్జనుడు పాత్ర ఎన్టీఆర్‌తో అనుకున్నారు. ఇక సుభద్ర పాత్రకు బి. సరోజాదేవి, సత్యభామ వేషానికి ఎస్. వరలక్ష్మిని.. రుక్మిణిగా జూనియర్ శ్రీరంజనిని తీసుకున్నారు. అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.. విజయవాడ దుర్గాకళామందిర్‌లో 150 రోజులు పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా చూసిన నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ తన భర్తకు ఓ సలహా ఇచ్చిందట. ఏమండి మీరు పౌరాణిక సినిమాల్లో రామారావు గారితో కలిసి నటించవద్దు అని ఖరాఖండీగా చెప్పేశారట. ఆయన పక్కన మీరు పౌరాణిక పాత్రలు వేస్తే తేలిపోతున్నారని చెప్పడంతో ఆయన నొచ్చుకున్నారట. ఆ తర్వాత
14 ఏళ్ల పాటు ఏఎన్నార్.. ఎన్టీఆర్‌తో పౌరాణిక సినిమాల్లో మాత్రమే కాదు… సాంఘీక సినిమాల్లో కూడా కలిసి నటించలేదు.
చివరకు 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి 1977లోఓ చాణక్య చంద్రగుప్త లో కలిసి నటించారు. అది ఏఎన్నార్‌కు సొంత సినిమా కావడం విశేషం. అలా శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా చూసి అన్నపూర్ణమ్మ అన్న మాటతో 14 ఏళ్లు వీరి మధ్య తెలియని గ్యాప్ వచ్చేసింది.