టాలీవుడ్ లో దివంగత సీనియర్ నటులు నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాల్లో విభేదాలు ఉండేవి. వాస్తవానికి కృష్ణ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ముందుగా ఎన్టీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాంటి వారిద్దరి మధ్య ఆ తర్వాత కాలంలో సినిమాల పరంగాను తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఇద్దరు వేరువేరు దారులలో ప్రయాణాలు చేశారు. కృష్ణ కూడా తన అభిమాన హీరో ఎన్టీఆర్ తోనే ఎన్నో విషయాల్లో ఢీకొట్టారు.. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
విచిత్రం ఏంటంటే కృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఒక సినిమా విషయంలో కూడా విభేదాలు చోటు చేసుకున్నాయి.
ఆ సినిమా ఎన్టీఆర్ నటించిన సినిమాయో లేదా కృష్ణ సినిమాయో కాదు. దీని వెనక ఒక ఆసక్తికరమైన యుద్ధమే జరిగింది. బాలయ్య – విజయశాంతి హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస సామ్రాట్ 1987 లో విడుదలైంది. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా నిర్మాణ సమయంలో పెద్ద వివాదాలకు కేంద్రంగా నిలిచింది.
ఈ సినిమాకు కేసీ. శేఖర్‌బాబు నిర్మాత. ముందుగా ఈ సినిమాకు సామ్రాట్ అనే పేరు పెట్టారు. అయితే ఈ టైటిల్ పై సూపర్ స్టార్ కృష్ణకు హక్కులు ఉన్నాయి. అదే టైటిల్ తో తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా తీయాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యని హీరోగా పెట్టి అదే టైటిల్ తో సినిమా తీస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న ఆయన నిర్మాత శేఖర్ బాబును ఆ టైటిల్ వాడవద్దని హెచ్చరించారు.. అయితే శేఖర్ బాబు అందుకు ఒప్పుకోలేదు.
చివరకు ఎన్టీఆర్ వద్దకు కూడా ఈ విషయం వెళ్ళింది. ఆయన కూడా అప్పటికే కృష్ణతో ఉన్న విభేదాల నేపథ్యంలో సైలెంట్ గా ఉన్నారు. కొంత కాలం పాటు సామ్రాట్ అనే టైటిల్ తోనే ఈ రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. చివరకు చిత్ర పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకున్నారు. అలా బాలయ్య సినిమా నిర్మాత శేఖర్ బాబు అయిష్టింగానే తన సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు తన సినిమా పేరును సాహస సామ్రాట్ గా మార్చారు. విచిత్రం ఏంటంటే ఇటు బాలయ్య సాహస సామ్రాట్ – కృష్ణ నిర్మించిన సామ్రాట్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి.