సినీ రంగంలో ఉన్నవారికి కొన్ని అలవాట్లు సహజం. ఎంతో మంది పరిచయం అవుతుంటారు. దేశ విదేశీ అభిమానులు కూడా నిత్యం తారసపడుతుంటారు. ఇక, ఇతర భాషా నటులు కూడా కలుస్తుంటారు. వారితోనూ కలిసి నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వారి అలవాట్లు కూడా రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లకు ఎన్టీఆర్, అక్కినేని వంటివారు చాలా దూరంగా ఉన్నారు.
ఎక్కడ ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటూ.. తమ అస్తిత్వాన్ని దెబ్బతీసుకోకుండా వ్యవహ రించారు. అందుకే వారు తెలుగు చిత్ర సీమలో చిరస్థాయిగా వేళ్లూనుకున్నారు. కానీ, కొందరు మహానటులు మాత్రం తమ వరకే పరిమితం అయ్యారు. వారికి ఉన్న అలవాట్లలో వారు పిచ్చిగా వ్యవహరించారు. వారు ఏది అలవాటు చేసుకుంటే.. దానిని అతిగా ప్రేమించారు. దీనివల్ల డబ్బు కాలం కూడా వృథా వేసుకుని.. ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.
ఇలాంటివారిలో ఎస్వీ రంగారావు పేరుప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చిన్నవయసులో ప్రాణాలు వదిలేశారు. అప్పటికే చేతినిండా అవకాశాలు ఉన్నాయి. కానీ, పెళ్లయిన తర్వాత.. ఒకావిడను ప్రేమించడం.. ఆమె మాయలో పడిపోయి కెరీర్‌ను దెబ్బతీసుకోవడం జరిగాయి. అలాగే విదేశీ మిత్రులతో కలిసి వ్యసనాలకు బానిస కావడం.. తాగందే నటించలేని పరిస్థితికి చేరుకోవడం వంటివి ఎస్వీ రంగారావుకు మైనస్‌గా మారాయని ఆయన మిత్రులు ఇప్పటికీ చెబుతంటారు.
ఈ అలవాట్లకు ఆయన దూరంగా ఉండి ఉంటే మరో వంద సినిమాల్లో ఆయన నటించి ఉండే వారని అంటారు. ఎస్వీఆర్ చాలా గొప్ప నటుడు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సరిసమానమైన నటుడు. నిజానికి ఎస్వీఆర్‌కు ఆ చెడు అలవాట్లు లేకపోయి ఉంటే ఆయన కూడా వారిద్దరితో సమానమైన పేరు ప్రఖ్యాతులే ఉండేవి. కానీ ఆ అలవాట్ల వల్లే ఆయన త్వరగా అస్తమించారు.