ఒక స్టార్ హీరో సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉన్నారంటే వారిద్దరి మధ్య ఎంతో కొంత ఈగో ఫీలింగ్ ఉంటుంది. ఇది ఇప్పటినుంచి కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో చూస్తూనే ఉన్నాం. అప్పట్లో దేవత సినిమాలో జయప్రద, శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇద్దరినీ బ్యాలెన్స్ చేసేందుకు ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు ముప్పు తిప్పలపడి మూడు చెరువుల నీళ్లు తాగారట. ఇక తాజాగా కేవలం శ్రీలీల ఉందన్న కారణంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వదులుకుంది ఒక క్రేజీ హీరోయిన్. ఎవరో కాదు మాళవిక మోహనన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా ముందుగా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావలసి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర కారు మనసులను కొల్లగొడుతున్న శ్రీలీలను ఒక హీరోయిన్గా, రెండో హీరోయిన్గా మాళవిక మోహనన్ ను తీసుకోవాలని దర్శకుడు హరీష్ శంకర్ అనుకున్నారు.
అయితే శ్రీలీల ఉందని తెలియడంతో అటువైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్ అయినా కూడా ఈ సినిమా చేయనని చెప్పేసిందట మాళవిక, తాను సోలో హీరోయిన్గా అయితేనే చేస్తానని ఇండైరెక్టుగా హింట్ కూడా ఇచ్చేసిందట. నిజంగా మాళవిక మోహనన్ లాంటి హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు ఎగిరి గంతేయాలి.. వెంటనే ఓకే చెప్పేయాలి.
కానీ మాళవిక ఎక్కడ రాజీ పడలేదు. సినిమాలో శ్రీలీలా ఉంటే తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకుందో.. లేదా ఉంటే గింటే పవన్ పక్కన పూర్తి హీరోయిన్గా తాను మాత్రమే ఉండాలని అనుకుందో.. గానీ ఆమె మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో హరీష్ శంకర్ మళ్లీ పూజా హెగ్డే వైపు కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది.