మణిరత్నం ఒకప్పుడు బాగా క్లాసిక్ దర్శకుడు. మణిరత్నం సినిమాలు అంటే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వుండేది. తమిళంలో మణిరత్నం సినిమా వస్తుందంటే తమిళంలో మాత్రమే కాదు తెలుగులోనూ అటు బాలీవుడ్ లోనూ కేవలం ఆయన సినిమాల కోసమే వేచి చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉండేవారు. ఎన్నో గొప్ప సినిమాలు మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. నాయకన్, ఘర్షణ, గీతాంజలి, సఖి ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో సునిశితమైన ప్రేమ కావ్యాలు మణిరత్నం చేతి నుంచి జాలువారాయి.
అయితే గత కొంతకాలంగా మణిరత్నం సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈతరం ప్రేక్షకులకు ఆయన సినిమాలు కనెక్ట్ కావడం లేదు. మారిన జనరేషన్ కు అనుగుణంగా మణిరత్నం మారలేదు. ఒక మూస ధోరణితో అక్కడే ఉండిపోయాడు. అయితే పొన్నియన్ సెల్వన్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సినిమా జనం బాగా ప్రేమ కురిపించేశారు. తమిళంలో ప్రసిద్ధి పొందిన ఓ నవలను సినిమాగా తెరకెక్కించాలని మణి అనుకున్నాడు.
అసలు ఆ నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించుటమే పెద్ద టాస్క్. ఆ పనిని మణిరత్నం సక్సెస్ గా చేశాడు. ఇక హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్య రాయ్‌ను తీసుకున్నాడు. ఇక తమిళ భాషకు సంబంధించి చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అందరూ తమిళులే. పైగా ఆ పాత్రల పేర్లు ఆ కథ మిగిలిన భాషల ప్రేక్షకులకు పెద్దగా అర్థం కాదు.. కనెక్ట్ కూడా కాదు. అందుకే తమిళంలో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో పది కోట్లకు అమ్మారు. 15 రోజులు దాటాక గాని బ్రేక్ ఈవెన్‌కు రాలేదు.
ఇక మణిరత్నం సినిమాలలో పెద్ద మైనస్ ఏంటంటే తమిళంలో పాటలు బాగా వస్తే చాలు అనుకుంటాడు. మిగిలిన భాషల్లోకి డబ్ చేసే సమయంలో కూడా సంగీతంలో జాగ్రత్తలు తీసుకోవాలని సోయి కూడా ఆయనకు కనిపించదు. మాటలు కూడా ఆ తమిళ వాసన కంపుకొడుతూ ఉంటాయి. అందుకే ఇతర భాషల ప్రేక్షకులకు ఆయన సినిమాలంటే వెగటు పుడుతున్నాయి. పైగా ఈ భారీ ప్రాజెక్టు కోసం మణిరత్నం కూడా నిర్మాతగా మారాడు. బయట ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి మరి పెట్టబడులు పెట్టాడు. సినిమా హిట్ అవ్వడంతో బతికిపోయాడు.
అయితే సుహాసినికి మాత్రం మణి ఈ రిస్క్ చేస్తుండటం ఎంత మాత్రం నచ్చలేదు. సినిమా పోతే ఏమైపోతుందో అన్న భయంతోనే ఉండేదట. మణిరత్నం గతంలో చాలాసార్లు రిస్క్ చేశాడు. అప్పుడు కూడా సుహాసినికి ఇష్టం ఉండేది కాదు. సినిమా ఏదైనా తేడా కొడితే రోడ్డు మీదకు వచ్చేయాల్సి ఉంటుందని ఆమె భయపడేది. అలా ఎప్పటికప్పుడు సుహాసినిని టెన్షన్ పెడుతూ మణిరత్నం సినిమాలు తీసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాడు.