పాత తరం హీరోయిన్లలో ఎల్. విజయలక్ష్మి ఒకరు. ఎల్ విజయలక్ష్మి స్వస్థలం మహారాష్ట్రలోని పూణే. భరతనాట్యం పై ఆమెకి ఉన్న ఆసక్తితో ఆమెను నాట్యంలో ప్రోత్సహించేందుకు.. ఆమె కుటుంబం ప్రత్యేకంగా చెన్నై వచ్చి అక్కడ సెటిల్ అయింది. చిన్నప్పటినుంచి ఎల్. విజయలక్ష్మి చాలా చురుకుగా ఉండేవారు. చాలా తక్కువ సమయంలోనే ఆమె మంచి నాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. కుమారి కమల అనే భరతనాట్య కళాకారుని స్ఫూర్తితో విజయలక్ష్మి నాట్యం నేర్చుకున్నట్టు చెప్పేవారు.
నాట్యంలో ఆమె అసామాన్య ప్రతిభ చూసి తెలుగు సినిమాలలో తొలిసారిగా ఆమెకు అవకాశం వచ్చింది. జగదేకవీరుని కథలో ఆమె నాగపుత్రికగా అద్భుతమైన నటన కనబరిచారు. ఆ తర్వాత ఇటు తెలుగుతోపాటు … అటు తమిళంలోనూ వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. 1961 లో సినిమా కెరీర్ ప్రారంభించిన ఆమె 1969లో తన చివరి సినిమా చేశారు. ఎన్టీఆర్ కి జోడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు.
విచిత్రం ఏమిటంటే ఎల్.విజయలక్ష్మి పెళ్లి వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. 1960వ దశకం చివరిలో వచ్చిన ఓ తమిళ సినిమా షూటింగ్ సమయంలో విజయలక్ష్మి సోదరుడి స్నేహితుడు ఆమె ఫోటో చూశారు. ఫోటో చూసిన వెంటనే ప్రేమలో పడిపోయారు. విజయలక్ష్మిని నేరుగా చూడకుండానే కేవలం ఫోటో చూసి ఆమె ప్రేమలో పడిపోయి.. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమె సోదరుడి ద్వారా వారి కుటుంబానికి రాయబారం పంపారు.
విజయలక్ష్మిని ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. అతను ఎవరో కాదు అప్పటికే ఫిలిప్స్ రాజధాని మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్త. అలా కెరీర్ పరంగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడే విజయలక్ష్మి పెళ్లి చేసుకుని భర్తతో పాటు మనీలా వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. పెళ్లి తర్వాత అక్కడ ఖాళీగా ఉండటం ఇష్టం లేక వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండటం విశేషం.